Health: అధిక రక్తపోటు అమ్మకు మంచిది కాదండోయ్‌

అమ్మదనం ఆస్వాదించాలనే తొందరలో చాలా మంది రకరకాల ఆహార పదార్థాలు, పండ్లు, మందులను తరచుగా తీసుకుంటారు. 

Published : 25 Apr 2022 02:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మతనం ఆస్వాదించాలనే తొందరలో చాలా మంది రకరకాల ఆహార పదార్థాలు, పండ్లు, మందులను తరచుగా తీసుకుంటారు. ఆరోగ్యానికి సరిపడితే మంచిదే కానీ కొన్నిసార్లు అధిక రక్తపోటుకు దారి తీయొచ్చు. కారణమేదైనా కాబోయే అమ్మ, కడుపులో బిడ్డకు అధిక రక్తపోటు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అప్పటి దాకా లేని రక్తపోటు ఎందుకు వస్తుంది. దాన్ని నియంత్రణలో ఉంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో గైనకాలజిస్టు పావని మాణిక్య వివరించారు.

ఎలా గమనించాలి: కాబోయే తల్లి ఆసుపత్రికి వెళ్లినపుడు తప్పనిసరిగా బీపీ పరీక్ష చేయించుకోవాలి. ప్రస్తుతం గర్భిణుల్లో 15-20 శాతం మందికి అధిక రక్తపోటు ఉంటోంది. 140/90 కంటే ఎక్కువగా ఉంటే బీపీ ఉన్నట్టే. చాలా మంది ఆసుపత్రికి వెళ్లగానే పరీక్ష చేయించుకుంటారు. ఇది సరికాదు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాత ఐదు నిమిషాలు కుదురుగా కూర్చొవాలి. ఆ తర్వాత బీపీ పరీక్ష చేయించుకోవాలి. అధిక రక్తపోటు ఉంటే 37 వారాల తర్వాత కావాల్సిన ప్రసవం తొందరగా కావొచ్చు. కడుపులో ఉండే బిడ్డ ఎదుగుదల కూడా తక్కువగా ఉంటుంది. ప్రసవం అయిన తర్వాత బిడ్డను ఐసీయూలో పెట్టడం, ఆహారం సరిగా తీసుకోకపోవడం లాంటి సమస్యలు రావచ్చు. 

రక్తపోటుతో ఎలా ఉంటుందంటే: సాధారణంగా గర్భం దాల్చిన 20 వారాల తర్వాత అమ్మకు అధిక రక్తపోటు రావొచ్చు. ఎక్కువగా పెరిగినపుడు వికారం, వాంతులు, తలనొప్పి, ఛాతీకింద నొప్పి, మూత్రం రావడం తగ్గిపోవడం, బరువు ఎక్కువగా పెరగడం, ఒంట్లో అధికంగా నీరు చేరడం, చూపు మందగించడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలుసుకోవాలి. ఉమ్మనీరు తగ్గిపోయి బిడ్డ, తల్లికి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. 

జాగ్రత్త సుమా: అధిక రక్తపోటు విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. జీవన శైలి కూడా మార్చుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించుకోవాలి. రక్తపోటును గుర్తించినప్పటి నుంచి క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. చాలా మందికి ప్రసవం తర్వాత మళ్లీ రక్తపోటు తగ్గిపోతుంది. బీపీ ఉన్నంత మాత్రనా శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం లేదు. బీపీ మందులు వేసుకున్నా పుట్టిన బిడ్డకు పాలు ఇవ్వడంతో ఇబ్బందులు రావు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని