AP High Court: జ్యుడీషియల్‌ అధికారిపైనే దాడి చేస్తారా?: హైకోర్టు

హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వకేట్‌ కమిషనర్‌గా వెళ్లిన న్యాయవాది, కోర్టు సిబ్బందిపై సీఐ దురుసు ప్రవర్తనను హైకోర్టు ధర్మాసనం సుమోటో పిల్‌గా తీసుకొని విచారణ జరిపింది.  

Updated : 08 May 2023 14:45 IST

అమరావతి: హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అడ్వకేట్‌ కమిషనర్‌గా వెళ్లిన న్యాయవాది, కోర్టు సిబ్బందిపై సీఐ దురుసు ప్రవర్తనను హైకోర్టు ధర్మాసనం సుమోటో పిల్‌గా తీసుకొని విచారణ జరిపింది. జ్యుడీషియల్ అధికారిపై దాడి, సీఐ ప్రవర్తన కోర్టు విధులను ఆటంకపరచడమేనని వ్యాఖ్యానించింది. సదరు సీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది. 

నేపథ్యమిదీ..

ఓ వ్యక్తిని పోలీసులు అక్రమ నిర్బంధంలో ఉంచారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు.. న్యాయవాది పి.ఉదయ్ సింహారెడ్డిని అడ్వకేట్‌ కమిషనర్‌గా నియమించింది. నిర్బంధంలో ఉంటే ఆ వ్యక్తిని తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు 2022 అక్టోబర్ 21న హిందూపురం 1వ పట్టణ ఠాణాకు అడ్వకేట్ కమిషనర్ వెళ్లారు. గిరీష్ అనే వ్యక్తి అక్రమ నిర్బంధంలో ఉన్నారని, పోలీసులు కొట్టినట్లు గుర్తించారు. గిరీష్‌ను కోర్టుకు తీసుకువెళ్తానని చెప్పగా.. సీఐ ఇస్మాయిల్ అడ్వకేట్ కమిషనర్‌పై దురుసుగా ప్రవర్తించి చేయిచేసుకున్నారు. ఈ వ్యవహారంపై  ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు.. గతంలో వివరణ కోరగా సీఐ నుంచి సంతృప్తికర సమాధానం రాలేదు. డీజీపీ నుంచి రెండు వారాల్లో వివరణ కోరాలని అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జితో పాటు అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. సకాలంలో డీజీపీ నుంచి సమాధానం రాలేదని న్యాయమూర్తికి హైకోర్టు రిజిస్ట్రీ గతంలోనే తెలిపింది. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం.. సీఐపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని