pot belly: ఒత్తిడికి గురికాకండి సుమీ.. పొట్టొచ్చేస్తుంది..!

అధిక కేలరీలు, చక్కెర ఉండే ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం ద్వారానే కాదు.. ఒత్తిడి కూడా పొట్టలో కొవ్వు పేరుకుపోవడానికి ప్రధాన కారణమని తాజా అధ్యయనాలు వెల్లడించాయి.

Updated : 21 Jun 2024 12:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్: మన శరీరంలో పొట్ట ఆరోగ్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. పొట్ట పెరుగుదల భౌతిక రూపాన్ని మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పొట్ట అతి పెరుగుదలకు జంక్‌ఫుడ్‌, కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడమే కాక.. ఒత్తిడి కూడా ప్రధాన కారణమని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు కార్టిసాల్‌ అధికంగా విడుదలవుతుంది. ఇది మానవ శరీరంలోని ప్రతీ అవయవం, కణజాలంపై ప్రభావం చూపే హార్మోన్‌. కార్టిసాల్‌ ఆహారాన్ని అధికంగా తీసుకోవడాన్ని ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా అధికంగా కొవ్వులు, చక్కెర ఉండే ఆహార పదార్థాలను తినాలనిపించేలా కోరికలను పెంచుతుందని నిపుణులు పేర్కొన్నారు.

ఇదిలాగే కొనసాగించడం వల్ల పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు నిల్వలు బాగా పెరిగిపోతాయి. తద్వారా మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు సహా ఇతర సమస్యలకు దారి తీయవచ్చు. ఎక్కువగా ఒత్తిడికి గురికావడంతో వచ్చే  పొట్ట బాగా పెరిగినట్లయితే.. వ్యాయామం, ఆహారంలో నిబద్ధతను పాటించినా ప్రయోజనం ఉండకపోవచ్చు. కాలేయం, పేగులు, అవయవ కండరాలు, ఇతర అంతర్గత అవయవాల్లో నిల్వ ఉండే విసెరల్‌ కొవ్వు పెరుగుదలను ఒత్తిడి ప్రోత్సహిస్తుంది.

ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి పూర్తి.. త్వరలో చుక్‌ చుక్‌ పరుగులు!

ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ విసెరల్‌కు మరింతగా ఫ్యాట్‌ తోడై కండరం గట్టిపడుతుంది. మందంగా తయారై శరీర ఆకృతిని మారుస్తుంది. ఇది జీవక్రియలను ప్రభావితం చేయడమే కాకుండా.. అతిగా తినడం, నిద్రలేమి, ధూమపానం, మద్యపానం వంటి దురలవాట్లకు దారి తీసే ప్రమాదం ఉంది.

ఇవి పాటిద్దాం..

  • ఒత్తిడి కారణంగా ఏది పడితే అది అతిగా తినడమే కాదు.. ఒక్కోసారి భోజనం చేయడం కూడా మానేస్తారట. ఆహారాన్ని మానుకోవడానికి బదులు వ్యాయామానికి ముందు తక్కువ మోతాదులో అల్పాహారాన్ని తీసుకోవాలి. ఇది కార్టిసాల్ స్థాయి తగ్గుదలకు ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు సూచించారు.
  • డీ హైడ్రేషన్ కూడా ఒత్తిడికి కారణం కావొచ్చు. దీన్ని నియంత్రించాలంటే రోజుకు తగినంత నీరు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి. ఇది జీవక్రియ పనితీరుకు సహకరిస్తుంది.
  • అధికంగా వ్యాయామం చేయడం కూడా కార్టిసాల్‌ పెరుగుదలకు కారణమవుతుందట. ఇది కొవ్వు కరగకుండా చేస్తుంది. శరీరానికి అవసరమైనంతవరకు వ్యాయామం చేయడమే మేలు. శరీరానికి తగినంత నిద్ర తప్పనిసరి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని