Temperature: బాబోయ్‌ ఎండలు మండిపోతున్నాయ్‌.. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో తెలంగాణ, ఏపీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

Updated : 15 May 2023 16:59 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. వడగాలుల తీవ్రత కూడా అధికమైంది. భానుడి ప్రతాపంతో ఏపీలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మారాయి. సాధారణం కంటే 4-6 డిగ్రీల మేర అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అన్ని చోట్లా పగటి ఉష్ణోగ్రతల తీవ్రత 40 డిగ్రీలకు పైగానే నమోదు అవుతుందని తెలిపింది. 

వాయవ్య భారత్ నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత పెరిగినట్లు భారత వాతావరణ విభాగం వివరించింది. ప్రస్తుతం గరిష్ఠ ఉష్ణోగ్రత దాదాపుగా 46 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా తర్లుపాడులో అత్యధికంగా 46.05 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.కృష్ణా జిల్లాలో 45.98 డిగ్రీలు, ప్రకాశం జిల్లా మద్దిపాడులో 45.96 డిగ్రీలు, గుంటూరు జిల్లా పొన్నూరులో 45.84 డిగ్రీలు, పల్నాడు జిల్లా నరసరావుపేటలో 45.79, ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.7 డిగ్రీలు, రాజమహేంద్రవరంలో 45.46, తూర్పుగోదావరి జిల్లాలో 45.3 డిగ్రీలు, బాపట్లలో 45.16, కాకినాడలో 45.12, గుంటూరులో 45.07, కోనసీమలో 45.01, కురిచేడులో 45, నంద్యాలలో 44.91, విజయనగరంలో 44.79, దుగ్గిరాలలో 44.76 ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 44.52, తిరుపతిలో 44.31, విజయవాడలో 44.21, నెల్లూరులో 44.18, మంగళగిరిలో 44.15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దు..

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సుమారు 42 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. మంగళవారం నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు 38 నుంచి 41 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాగల 3 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దిగువ స్థాయిలోని గాలులు వాయవ్య దిశ నుంచి తెలంగాణ వైపుకు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని