Telangana News: రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక విద్యుత్‌ డిమాండ్‌ నమోదు

తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగా వాట్ల విద్యుత్ (అత్యధిక పీక్ డిమాండ్) నమోదు అయ్యిందని వెల్లడించారు.

Published : 30 Mar 2023 16:07 IST

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగించినట్లు విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపారు. గురువారం ఉదయం 11.01 నిమిషాలకు 15,497 మెగా వాట్ల విద్యుత్ (అత్యధిక పీక్ డిమాండ్) నమోదు అయ్యిందని వెల్లడించారు. మార్చి నెల ఆరంభం నుంచే 15,000 మెగా వాట్ల విద్యుత్ వినియోగం నమోదు అవుతూ వస్తోందని పేర్కొన్నారు. 

వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికం కావడం, వ్యవసాయ రంగానికి విద్యుత్ వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజురోజుకీ విద్యుత్‌ డిమాండ్‌ పెరుగుతోంది. సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలకు విద్యుత్ వినియోగం అధికమవుతోంది. మొత్తం విద్యుత్ వినియోగంలో వ్యవసాయ రంగానికే 37 శాతం వాడినట్లు నమోదైంది. మొత్తం విద్యుత్ వినియోగంలో దక్షిణ భారతదేశంలో తమిళనాడు మొదటి స్థానం కాగా, రెండో స్థానంలో తెలంగాణ నిలిచింది. నిన్న 14,422 మెగా వాట్లు కాగా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అత్యధికంగా రికార్డు స్థాయిలో గురువారం 15,497 మెగా వాట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదు కావడం ఇదే తొలిసారి.

డిమాండ్‌ పెరిగినా సరఫరాకు అంతరాయం ఉండదు: సీఎండీ ప్రభాకర్‌ రావు

‘‘ఈ ఏడాది వేసవి కాలంలో 16 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. ఎంత డిమాండ్ వచ్చిన సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటాం. మార్చి నెలలో 15,000 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు అవుతోందని ముందే ఉహించాం. అందుకు సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు విద్యుత్ సరఫరాకు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్ర రైతాంగానికి, అన్ని రకాల వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తాం’’ అని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌ రావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని