Andhra News: విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్ వివాదం

విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్‌ వివాదం తలెత్తింది. 

Updated : 17 Feb 2022 12:56 IST

కరెన్సీ నగర్‌(విజయవాడ): విజయవాడ లయోలా కళాశాలలో హిజాబ్‌ వివాదం తలెత్తింది. హిజాబ్‌ వేసుకొచ్చిన ఇద్దరు బీఎస్సీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థినులను సెక్యూరిటీ గేటు వద్ద ఆపేశారు. తరగతి గదుల రౌండ్స్‌కు వెళ్తున్న ప్రిన్సిపల్‌ కిషోర్‌ వీరిని గమనించి ప్రశ్నించారు. హిజాబ్‌ ఎందుకు ధరించారని.. దుస్తులు మార్చుకొని రావాలన్నారు. అసలే కర్ణాటకలో హిజాబ్‌ వివాదం నడుస్తోన్న నేపథ్యం.. దాంతో పాటు ఫైనల్‌ ఇయర్‌ కావడంతో విద్యార్థినులు భయపడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తాము మొదటి సంవత్సరం నుంచి హిజాబ్‌తోనే తరగతులకు హాజరవుతున్నామని వారు చెప్పారు. ఐడీ కార్డుల్లో కూడా హిజాబ్‌తోనే ఫొటో దిగామని తెలిపారు.

అనంతరం వారి తల్లిదండ్రులతో పాటు మతపెద్దలు కళాశాల వద్దకు చేరుకొని ప్రిన్సిపల్‌తో మాట్లాడారు. పోలీసులు సైతం కళాశాల వద్దకు చేరుకొని ఘటనపై ఆరా తీశారు. ప్రిన్సిపల్‌తో తల్లిదండ్రులు, పోలీసులు మాట్లాడిన కొద్దిసేపటి తర్వాత విద్యార్థినులను హిజాబ్‌తోనే తరగతి గదుల్లోకి అనుమతించారు.  కర్ణాటకలో హిజాబ్ వివాదం నడుస్తోన్న నేపథ్యంలో లయోలా కళాశాలలో తాజా ఘటన చర్చనీయాంశమైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని