పావ్‌భాజీ అలా తయారైంది!

నోరూరించే స్ట్రీట్‌ ఫుడ్‌లో పావ్‌భాజీ ఒకటి. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ వంటకం కనిపిస్తుంటుంది. ముంబయిలో అయితే పావ్‌భాజీ చాలా ఫేమస్‌. అక్కడి ప్రజలు దీన్ని తినకుండా ఉండలేరంటే అతియోశక్తి కాదు. నిజానికి ఈ వంటకం ముంబయిలోనే తయారైంది. ఇందుకు కారణం

Updated : 31 Jan 2021 17:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నోరూరించే స్ట్రీట్‌ ఫుడ్‌లో పావ్‌భాజీ ఒకటి. దేశంలో ఎక్కడికి వెళ్లినా ఈ వంటకం కనిపిస్తుంటుంది. ముంబయిలో అయితే పావ్‌భాజీ చాలా ఫేమస్‌. అక్కడి ప్రజలు దీన్ని తినకుండా ఉండలేరంటే అతియోశక్తి కాదు. నిజానికి ఈ వంటకం ముంబయిలోనే తయారైంది. ఇందుకు కారణం మాత్రం అమెరికా అంతర్యుద్ధం. ముంబయిలో పావ్‌భాజీకి.. అమెరికా అంతర్యుద్ధానికి ఏంటి సంబంధం?అని ఆశ్చర్యంగా ఉంది కదా.. అయితే పావ్‌భాజీ చరిత్రేంటో మీరే చదివేయండి..

1860ల్లో అమెరికాలో అంతర్యుద్ధం జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే, ఆ సమయంలో అమెరికా వ్యాప్తంగా పత్తి సరఫరా లేక.. సంక్షోభం ఏర్పడింది. దీంతో పత్తి దిగుమతి కోసం వివిధ దేశాలను ఆన్వేషించిన అమెరికాకు భారత్‌లోని ముంబయి కనిపించింది. ఇక్కడ పత్తి మిల్లులు అధికంగా ఉండటం, ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉండటంతో పత్తి డీలర్లతో సంప్రదింపులు జరిపారు. అమెరికా భారీ మొత్తంలో ఆర్డర్‌లు ఇవ్వడంతో ముంబయిలోని పత్తి మిల్లుల్లో పనులు పెరిగాయి. ఈ క్రమంలో కార్మికులకు పని పెరిగింది. కొన్నిసార్లు కార్మికులు రాత్రంతా పని చేయాల్సి వచ్చేది. అయితే, రాత్రిపూట మధ్యలో ఆకలి వేస్తే తినడానికి కార్మికులకు ఎలాంటి ఆహారం లభించేది కాదు. దీంతో ఏమి తినకుండా కడుపు మాడ్చుకొని పనిచేసేవాళ్లు. అలాంటి కార్మికుల కోసం చిరుతిండ్లు విక్రయించే వ్యాపారులు ఓ ఉపాయం ఆలోచించారు. 

మార్కెట్లో విక్రయించగా మిగిలిన కూరగాయలు, టమోటా, బంగాళదుంపలు తీసుకొచ్చి అన్నింటికి కలిపి కూరలా వండేవారు. వెన్నలో బ్రెడ్‌ను వేయించి ఈ కూరతోపాటు విక్రయించేవారు. కార్మికులు ఆ బ్రెడ్‌ ముక్కల్ని కూరలో అద్దుకొని తిని కొత్త రుచిని ఆస్వాదించారు. అలా తక్కువ ధరలో, తక్కువ సమయంలో కడుపు నిండా తినే ఆహారం తయారైంది. కార్మికులు పావ్‌భాజీకి ఫిదా అయ్యారు. అమెరికా ఇచ్చే పత్తి ఆర్డర్లతో ముంబయిలో మరిన్ని పత్తి మిల్లులు వచ్చాయి. వాటిలో పనిచేసే కార్మికుల నుంచి పావ్‌భాజీకి మరింత ఆదరణ లభించింది. దీంతో ముంబయి మొత్తం ఈ పావ్‌భాజీ విస్తరించింది. కార్మికుల నుంచి సాధారణ ప్రజల వరకు తినడం మొదలుపెట్టారు. ఆ తర్వాత రోడ్డు పక్క హోటల్స్‌ నుంచి రెస్టారెంట్ల వరకు అన్ని చోట్ల ఆహార పదార్థాల జాబితాలో పావ్‌భాజీ వచ్చి చేరింది. ముంబయిలోనే కాదు.. దేశవ్యాప్తంగా విభిన్న రుచులతో పావ్‌భాజీ ఆహార ప్రియులకు అందుబాటులో ఉంటుంది.

పావ్‌భాజీకి ఆ పేరెలా వచ్చింది?

భాజీ అంటే మరాఠీలో కూరగాయలు అని అర్థం. బ్రెడ్‌ను పావ్‌ అని పిలుస్తారు. దీనికి గల కారణమేంటంటే.. ఒక బ్రెడ్‌ను నాలుగు భాగాలుగా విభజించి ఇస్తుంటారు. ఒక్కో దాన్ని తీసుకొని తినాలి. నాలుగులో ఒక వంతును పావ్‌ అని పిలుస్తాం. అందుకే ఆ బ్రెడ్‌ను పావ్‌ అంటారని చెబుతుంటారు. అలా ఈ రెండింటిని కలిపి పావ్‌భాజీ అని పిలుస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని