శ్వాసపై దృష్టి పెట్టండి..

ఎక్కువ సేపు ఊపిరి బిగబట్టి ఉంటున్నారా..? లేదా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నారా..? శ్వాసక్రియలో ఇబ్బందిగా ఉందా..? వీటిలో మీకు ఏ లక్షణం ఉన్నా మీరు కరోనా వైరస్‌ ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లే..

Published : 11 Jan 2021 23:45 IST

దిల్లీ: ఎక్కువ సేపు ఊపిరి బిగబట్టి ఉంటున్నారా..? లేదా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నారా..? శ్వాసక్రియలో ఇబ్బందిగా ఉందా..? వీటిలో మీకు ఏ లక్షణం ఉన్నా మీరు కరోనా వైరస్‌ ప్రభావానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్లే.. ఈ మేరకు ఐఐటీ మద్రాస్‌ ఒక పరిశోధనలో తెలిపింది. ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌ జర్నల్‌లో ఈ పరిశోధనకు చెందిన పత్రాలు ఇటీవల ప్రచురితమయ్యాయి. శ్వాసకోశ వ్యాధులను సరైన చికిత్స చేసేందుకు ఈ పరిశోధన ఉపకరిస్తుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా శ్వాసకోశ వ్యాధులు అందర్నీ ఎక్కువగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం ఇతరులకు సంక్రమించే స్వభావాన్నే కలిగి ఉన్నాయి. అందువల్ల వీటికి గల కారణాలను మొదలు నుంచి అన్వేషించామని పరిశోధకులు తెలిపారు. మన శ్వాసక్రియలో అవకతవకల వల్ల కూడా మనం కరోనా వైరస్‌ బారిన పడతామని తెలుపుతున్నారు. శ్వాసక్రియ వేగాన్ని బట్టి లోపలికి చేరిన వైరస్ ప్రభావం ఉంటుందన్నారు. మనం నెమ్మదిగా శ్వాసను తీసుకొంటే వైరస్‌ లోపల ఉండే సమయం పెరిగి అది ఇన్ఫెక్షన్‌కు దారితీయొచ్చని తెలిపారు.

పరిశోధక బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ మహేశ్‌ పంచజ్ఞుల మాట్లాడుతూ.. ‘‘ కరోనా వైరస్‌ మానవ శరీరంలోని ఏఏ భాగాల్లో ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందన్న అంశాలపై ఉన్న సందేహాలను తొలగించేందుకు మేం ఈ పరిశోధనను నిర్వహించాం. ఊపిరితిత్తుల లోపలి భాగాలకు వైరస్‌ ఎలా చేరుతుందన్న అంశంపై మా పరిశోధన మెరుగైన ఫలితాల్నిచ్చింది.’’ అని ఆయన తెలిపారు. గాలి ద్వారా వ్యాపించే ఈ వైరస్‌లు ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావాన్ని చూపడాన్ని తాము విశ్లేషించినట్లు ఆయన తెలిపారు. ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ స్కాలర్లు అర్ణబ్‌ కుమార్‌ మాలిక్‌, సౌమల్య ముఖర్జీ వారి పరిశోధన గురించి వివరించారు. ‘‘శ్వాస సంబంధ వ్యాధులు, కరోనా వైరస్‌ వంటివి దగ్గడం, తుమ్మటం వల్ల వ్యాపిస్తాయి. ఇలాంటపుడు చిన్న తుంపర్లు వెలువడతాయి. అవి మన శ్వాసకోశ మార్గం ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరతాయి. దీనికోసం మేం ఫ్లోరోసెంట్‌ ద్వారా కృత్రిమ తుంపర్లను ఏర్పాటు చేసి వాటి ప్రయాణాన్ని విశ్లేషించాం. ఇవి శ్వాసనాళాల్లో ఎక్కువ సమయం నిలిచిపోతున్నాయి. దీంతో వైరస్‌ ప్రభావం శరీరంపై ఎక్కువగా ఉంటుంది.’’ అని వారు తెలిపారు.

ఇవీ చదవండి..

స్పుత్నిక్‌ టీకా ఎంతమంది తీసుకున్నారంటే..

కొవిషీల్డ్‌ డోసుల కోసం కేంద్రం ఆర్డర్‌..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని