National news: గుర్రం అంతిమయాత్రకు వందల మంది హాజరు

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ వందల మంది ఓ గుర్రం అంతిమయాత్రకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు....

Published : 25 May 2021 01:18 IST

బెంగళూరు: కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ వందల మంది ఓ గుర్రం అంతిమయాత్రకు హాజరవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాష్ట్రం బెళగావిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. మరాడిమఠ్‌ గ్రామంలో స్థానికంగా ఉండే ఓ మత సంస్థకు చెందిన గుర్రం అనారోగ్యంతో ఆదివారం ఉదయం మృతిచెందింది. అయితే ఆ గుర్రం అంతిమయాత్ర నిర్వహించగా.. వందల మంది గ్రామస్థులు అందులో పాల్గొన్నారు. కరోనా విజృంభిస్తున్నా.. వారంతా ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఆ అంతిమయాత్రలో పాల్గొన్నారు. వారిలో చాలా మంది మాస్కులు కూడా ధరించలేదు.

అయితే ఆ అంతిమయాత్రకు సంబంధించిన కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అప్రమత్తమైన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. గ్రామాన్ని సీల్‌ చేశారు. గ్రామస్థులకు ప్రస్తుతం వైద్య సిబ్బంది ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారని.. మరో 14 రోజులు గ్రామం నిర్బంధంలోనే ఉండనున్నట్లు పోలీసు సూపరింటెండెంట్‌ లక్ష్మణ్‌ నింబర్గి పేర్కొన్నారు.

కర్ణాటకలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ నెల 10వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ విధించింది.  24వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపింది. కాగా తాజాగా జూన్‌ 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కర్ణాటకలో ఇప్పటివరకు 24 లక్షలకు పైగానే కరోనా కేసులు నమోదయ్యాయి. 25 వేలకు పైగా మంది మృతిచెందారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 4.73 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు