Uttarakhand: జారిపోతున్న ఇళ్లు.. సర్వేలో వెల్లడైన నిజాలివే!

ఉత్తరాఖండ్‌ పిథోరాగఢ్‌ జిల్లాలోని దర్మా లోయపై ఉన్న దార్ గ్రామవాసులు కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కారణం.. వారి ఇళ్లు క్రమంగా కిందికి జారిపోతుండటమే! ఈ విషయమై గ్రామ సర్పంచి.. జిల్లా యంత్రాంగానికి లేఖ రాయగా, ఇక్కడికి ఓ జియాలజిస్టుల...

Updated : 28 Nov 2021 05:19 IST

దేహ్రాదున్‌: ఉత్తరాఖండ్‌ పిథోరాగఢ్‌ జిల్లాలోని దర్మా లోయపై ఉన్న దార్ గ్రామవాసులు కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కారణం.. వారి ఇళ్లు క్రమంగా కిందికి జారిపోతుండటమే! ఈ విషయమై గ్రామ సర్పంచి.. జిల్లా యంత్రాంగానికి లేఖ రాయగా, ఇక్కడికి ఓ జియాలజిస్టుల బృందాన్ని పంపింది. వారి సర్వేలో విస్మయకర అంశాలు బయటపడ్డాయి. ఈ గ్రామం కింది నేల బలహీనంగా మారడంతోనే ఇలా జరుగుతోందని, ప్రస్తుతం ఇది నివాసయోగ్యంగా లేదని తేలింది. భూగర్భ జలాలతోపాటు ఇక్కడి సోబ్లా- టిడాంగ్‌ రహదారి విస్తరణ పనుల కారణంగా నేల బలహీనపడుతోందని జియాలజిస్టుల బృందానికి నాయకత్వం వహించిన శాస్త్రవేత్త ప్రదీప్ కుమార్ వెల్లడించారు. గ్రామంలో నివసిస్తున్న మొత్తం 150 కుటుంబాల్లో కనీసం 35 కుటుంబాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఉందన్నారు.

కొండచరియల శిథిలాలపై..

‘సుమారు రెండు శతాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడినప్పుడు.. ఇక్కడి నీటి వనరులు సైతం వాటి శిథిలాల కింద భూమిలోకి వెళ్లిపోయాయి. కొన్నాళ్లుగా ఈ భూగర్భ జలాలు మరింత కిందికి వెళ్తున్న కారణంగా.. నేల పై పొరలు బలహీనపడుతున్నాయ’ని కుమార్ వివరించారు. ప్రస్తుతం దార్‌ గ్రామం సైతం ఇదే తరహా కొండచరియల శిథిలాల మీద ఉన్నట్లు చెప్పారు. ఇప్పటికే ఈ గ్రామం నేల బలహీనమైందని.. కింద గట్టి రాళ్ళు కూడ లేవని ఆయన తెలిపారు. ఏ క్షణంలోనైనా విపత్తు సంభవించే అవకాశం ఉన్నందున ఆ ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని గ్రామ సర్పంచి ఇక్కడి ధార్చుల సబ్‌ డివిజన్‌ ఎస్‌డీఎం ఏకే శుక్లాకు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా.. ధార్చుల, మున్స్యారి సబ్ డివిజన్‌లలోని దాదాపు 200 గ్రామాలు ఇలాంటి కొండచరియల శిథిలాల మీదే ఉండటం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని