Facebook Message: తల్లి చెంతకు బిడ్డను చేర్చిన ఫేస్‌బుక్‌ మెసేజ్‌!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమార్తెను ఓ ఫేస్‌బుక్‌ మెసేజ్‌ తిరిగి తల్లి చెంతకు చేర్చింది

Published : 17 Sep 2021 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కుమార్తెను ఓ ఫేస్‌బుక్‌ మెసేజ్‌ తిరిగి తల్లి చెంతకు చేర్చింది. అమెరికా-మెక్సికో సరిహద్దు వద్ద తిరిగి వాళ్లిద్దరు కలుసుకునేలా చేసింది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతానికి చెందిన పాబ్లో హెర్నాండెజ్, ఏంజెలికా వెన్సెస్‌ సల్గాడో దంపతులకు జాక్వెలిన్‌ హెర్నాండెజ్‌ పుట్టింది. అయితే, 2007 డిసెంబరులో ఆరేళ్ల వయసున్న ఆమెను తండ్రి ఎత్తుకు వెళ్లిపోయాడు. ఈ ఘటనపై తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు ఆమె ఆచూకీ గురించి వెతికినా ప్రయోజనం లేకపోయింది.

సరిగ్గా 14 ఏళ్ల తర్వాత జాక్వెలిన్ ఫేస్‌బుక్‌లో తల్లికి మెసేజ్‌ చేసింది. తను మెక్సికోలో ఉన్నట్లు చెప్పింది.  తనను కలవడానికి టెక్సాస్‌లోని లారెడోకు రమ్మంది. ఈ విషయాన్ని పోలీసులకు వివరించి ఎలాగోలా కుమార్తెను తన దగ్గరికి చేర్చాలని వేడుకొంది. పోలీసులు జాక్వెలిన్‌ను గుర్తించడానికి ఓ ప్రణాళికను రూపొందించారు. ఆమె తల్లి చెప్పిన ప్రాంతానికి రాగానే జాక్వెలిన్‌ ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. చివరగా ఆమెనే తప్పిపోయిన ఏంజెలికా కుమార్తె అని నిర్ధారించారు. కొద్ది గంటల్లోనే తల్లి దగ్గరికి చేర్చారు. అయితే.. తండ్రి ఎందుకు అపహరించాడో? ఇప్పుడు ఎక్కడున్నాడో అన్న వివరాలపై స్పష్టత రాలేదు.

అమెరికాలోని క్లెర్‌మాంట్‌ పోలీసులు ఈ కేసు వివరాల్ని ఫేస్‌బుక్‌లో పంచుకోవడంతో వైరల్‌ అయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని