
Climate Change: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వరదలకు కారణాలివే!
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల చైనా, జపాన్, జర్మనీ, బెల్జియం, భారత్, నేపాల్ తదితర దేశాల్లో విపరీతంగా వరదలు సంభవించాయి. పశ్చిమ ఐరోపాలో వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల కారణంగా జర్మనీ, బెల్జియంలో నాలుగు రోజుల కింద 168 మంది మృతిచెందారు. జర్మనీలోనే 100మందికి పైగా చనిపోయారు. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్‌లో కూడా నదులన్నీ కట్టలు తెగేలా నిండుగా ప్రవహించాయి. లండన్‌లో గతవారం ఆకస్మిక వరదలు వచ్చాయి. జపాన్‌లో పక్షం రోజుల కింద బురదతో కూడిన వరదలు వచ్చి 19 మంది గల్లంతయ్యారు. మరోవైపు తాజాగా చైనాను భారీ వరదలు ముంచెత్తాయి. హెనన్ ప్రావిన్స్‌లోని 12 ప్రాంతాల్లో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ ప్రావిన్స్‌లో 25 మంది చనిపోయారు. చైనాలో ఈ ఏడాదంతా పడాల్సిన వర్షం కేవలం మూడు రోజుల్లోనే కురిసింది. వెయ్యి ఏళ్లలో ఆ దేశంలో కురిసిన అతిపెద్ద కుంభవృష్టి ఇదేనంటున్నారు. వరదలు రావడానికి కారణమేమిటని ఎవరినైనా అడిగితే.. ఇంకేముంది.. అతిగా వర్షాలు కురవడమేనని వెంటనే చెప్పేస్తారు. కానీ వర్షాలు ఎందుకు అతిగా కురుస్తాయి? వరదలు రావడానికి ఇతర కారణాలేమైనా ఉన్నాయేమో చూద్దాం..
భూతాపం.. అధిక ఉష్ణోగ్రతల వల్లే!
వాతావరణం వేడెక్కడం వల్ల అనేక మార్పులు జరిగి తీవ్రమైన వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నీరు ఎక్కువగా ఆవిరై, వాతావరణంలో బాగా తేమ చేరుతుంది. అంతేకాదు, ఇంకా అనేక తీవ్రమైన వాతావరణ మార్పులు జరుగుతాయి. తాజాగా చైనాలో ముంచెత్తిన వరదలపై గ్లోబల్ వార్మింగే దీనికి కారణమని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. లండన్, ఎడిన్‌బరోలో వచ్చిన ఆకస్మిక వరదలకు వాతావరణ మార్పులే కారణమని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా ఇలాంటివి సంభవిస్తాయని శాస్త్రవేత్తలు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. ప్రకృతిని నాశనం చేయడం వల్ల వాతావరణం తీవ్రంగా దెబ్బతింటోందనీ, ఫలితంగా విపరీతమైన ఎండలు, వర్షాలు, కరువు కాటకాలు ఏర్పడుతాయని చాలా ఏళ్ల నుంచి ఆయా రంగాలకు చెందిన నిపుణులు వాపోతున్నారు. యంత్రాల్లోంచి విడుదలయ్యే పొగ, కార్చిచ్చులు, పారిశ్రామిక ఉద్గారాలు భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. వాతావరణం వేడెక్కడం వల్ల తేమ శాతం కూడా పెరిగి, అధిక వర్షాలకు కారణమవుతోంది. ఇప్పటికే పారిశ్రామికీకరణ పూర్వరోజులకంటే భూతాపం 1.2 డిగ్రీ సెల్సియస్ అధికంగా పెరిగింది. దీన్ని 2 సెల్సియస్ వరకూ అనుమతించవచ్చని, సాధ్యమైనంతవరకూ 1.5 డిగ్రీలకంటే తక్కువ ఉండేలా చూసుకోవాలని 2015 డిసెంబరులో జరిగిన పారిస్ ఒప్పందంలో 187 దేశాలు ఒక అంగీకారానికి వచ్చాయి. కానీ, ప్రస్తుతం పెరిగిన 1.2 డిగ్రీల భూతాపానికే ప్రపంచం తట్టుకోలేకపోతోంది. భూతాపం 1 డిగ్రీ పెరిగితే, గాలిలోని తేమ ఎనిమిది శాతం పెరుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. బొగ్గుపులుసు వాయువు ఉద్గారాలను కట్టడి చేయాలని, లేకపోతే విపరీతమైన వాతావరణ మార్పులకు సిద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతూనే ఉన్నారు. 2014 నుంచి ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు వరుసగా ఏడేళ్లపాటు నమోదవుతున్నాయి. కెనడా, ఉత్తర అమెరికాలో గత నెలలో హీట్‌వేవ్స్ వచ్చాయి. కెనడాలోని లిట్టన్‌లో ఎన్నడూ లేనంతగా 49.6 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. భారతదేశంలోనూ వాతావరణ మార్పుల కారణంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. గడచిన ఐదు దశాబ్దాల్లో ఇక్కడ వడగాల్పుల వల్ల దాదాపు 17 వేలమంది ప్రాణాలు కోల్పోయారని భారత వాతావరణ శాఖ తెలియజేసింది.
అడవుల నరికివేత.. చెరువుల ఆక్రమణ!
పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచో పర్వతాలు, కొండలు, గుట్టల మీదున్న అడవులను నాశనం చేయడం, చెరువులు, నాలాలు ఆక్రమించుకోవడం వల్ల ఆకస్మిక వరదలు ముంచెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఆనకట్టలను కట్టి, వరదనీటిని నిల్వ చేసుకుంటున్నాం. మంచిదే. కానీ ‘‘సహజసిద్ధంగా ఏర్పడిన వాగులు వంకలను లేకుండా చేశాం. దీనివల్ల వర్షాలు కురిసినప్పుడు పర్వతాలు, కొండల మీదుగా అకస్మాత్తుగా పెద్ద ఎత్తున ప్రవాహాలు కిందకు ప్రవహించి మైదానాలను ముంచెత్తుతున్నాయి’’ అని ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ్(ఐసీఏఆర్) శాస్త్రవేత్త కె.కె.బర్మన్ అంటారు. 2018లో కేరళలో వచ్చిన వరదలకు అడవులు తగ్గిపోవడం ప్రధానమైన కారణమని తేలింది. ఇడుక్కిలో 21 శాతం, వయనాడు జిల్లాల్లో 11 శాతం మేరకు అడవులు తగ్గిపోయాయి. మిగతా జిల్లాల్లోనూ సహజసిద్ధంగా పెరిగే చెట్లు తగ్గిపోయి, కమర్షియల్ ప్లాంటేషన్ పెరగడం వల్ల భూస్వరూపంలో మార్పులు వచ్చి దాదాపు అన్ని జిల్లాలను వరదలు ముంచెత్తాయి.
ఆనకట్టలూ కారణమే!
వరదనీటిని సక్రమంగా నిలువ చేసి, ఉపయోగించుకునేందుకు కట్టిన రిజర్వాయర్లు కూడా కొన్నిసార్లు వరదలకు కారణమవుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం లేనప్పుడు ఉన్నపళంగా డ్యామ్ గేట్లన్నీ ఎత్తి దిగువ ప్రాంతాలకు వదలడంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతాయి. 2019లో కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఇలాగే జరిగింది. అప్పుడు 71 మంది చనిపోయారు. హిడ్కల్ డ్యామ్, మలప్రభ డ్యాం గేట్లను ఎత్తివేయడంతో భారీ ఆస్తినష్టం కూడా జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్నప్పుడు ముందుగానే లోతట్టులో ఉండే జనావాసాలను ఖాళీ చేయించాలి. ప్రజలకు, ప్రభుత్వ యంత్రాంగానికి మధ్య సరైన అనుసంధాన వ్యవస్థ ఉండాలి. డ్యామ్‌ల నిర్వహణ వ్యవస్థ బాగుండాలి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, నదుల్లో నీటి ప్రవాహం గురించి సరైన అంచనా వేయగలగాలి. వరదల గురించి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే వ్యవస్థను బలోపేతం చేయాలి. అలాగే విపత్తు నిర్వహణ సక్రమంగా జరిగితే ఇలాంటి వరదలనుంచి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవచ్చు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
-
Technology News
Android 12: ఆండ్రాయిడ్ 12 యూజర్లకు గూగుల్ మరో కొత్త యాప్
-
World News
Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
-
India News
Road Safety: ఆ నియమాలు పాటిస్తే.. ఏటా 30వేల ప్రాణాలు సేవ్ : ది లాన్సెట్
-
Sports News
Eoin Morgan: ధోనీ, మోర్గాన్ కెప్టెన్సీలో పెద్ద తేడా లేదు: మొయిన్ అలీ
-
Crime News
Cyber Crime: మీ ఖాతాలో డబ్బులు పోయాయా?.. వెంటనే ఇలా చేయండి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్‌ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Maharashtra Crisis: ఫడణవీస్ ఎందుకు సీఎం బాధ్యతలు చేపట్టలేదంటే?
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేత!
- ‘ఉడత ఊపితే’ తీగలు తెగుతాయా!
- ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Eknath Shinde: మహారాష్ట్ర సీఎంగా శిందే
- Andhra News: కాటేసిన కరెంటు
- BJP: అంబర్‌పేట్‌లో భాజపా దళిత నాయకుడి ఇంట్లో భోజనం చేసిన యూపీ డిప్యూటీ సీఎం