ఉప్పు నీటి సమస్యా.. జుట్టును ఇలా కాపాడుకోండి!

ఉప్పుతో చాలా అనర్థాలు ఉన్నాయి. వంటల్లో ఉప్పు ఎక్కువ అయితే బీపీ పెరుగుతుంది.

Updated : 13 Jul 2021 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉప్పుతో చాలా అనర్థాలు ఉన్నాయి. వంటల్లో ఉప్పు ఎక్కువ అయితే బీపీ పెరుగుతుంది. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా ఉప్పు ఉన్న నీటితో తలస్నానం చేసినట్లయితే జుట్టు పాడవుతుంది. ఉప్పునీటిలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు రాలడం, చివర్లు చిట్లిపోవడం, మృధుత్వం దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

ఉప్పు నీటిలో ఉండే కాల్షియం లవణాల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లి క్రమంగా ఊడిపోతాయి. పొడిబారినట్లై.. కొన్నిసార్లు జుట్టు ఎండుగడ్డిలా మారడం, పల్చబడటం, నెరవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. కండిషనర్‌ వాడుతున్నప్పటికీ ఈ సమస్యలు తొలగిపోవు. అలాంటపుడు నీటిలో లవణాలు ఎంత మేరకు ఉన్నాయో గుర్తించాలి. అందుకోసం నీటి కాఠిన్యతను పరీక్షించాలి. ఒక మగ్గు నీటిలో సబ్బు వేసి నురగ వచ్చేదాకా బాగా కలపాలి. నురగ బాగా వస్తే ఆ నీరు కఠిన జలం కాదని తెలుస్తుంది. ఒకవేళ నురగ రాకపోతే ఆ నీటిని తలస్నానానికి వాడకూడదు. 

ఉప్పునీటి దుష్ప్రభావాల నుంచి జుట్టును కాపాడుకోవడానికి కొబ్బరినూనె ఎంతగానో ఉపయోగపడుతుంది. కొబ్బరినూనె వెంట్రుకలలో ఉన్న ప్రొటీన్‌ను కాపాడుతుంది. కాబట్టి తలస్నానం చేయడానికి ముందు, తర్వాత కొబ్బరినూనెను తలకు పట్టించుకోవాలి. అలాగే వెనిగర్‌ వెంట్రుకల పీహెచ్‌ స్థాయులను నియంత్రిస్తుంది. జుట్టు నున్నగా ఉండటానికి, నిగనిగలాడ్డానికి దోహదం చేస్తుంది. అందువల్ల తలస్నానం చేసిన తర్వాత మూడు గ్లాసుల నీటిలో ఒక చెంచా వెనిగర్‌ కలిపి దాన్ని జుట్టుకు రాసుకోవాలి. కొద్ది నిమిషాల తర్వాత నీటితో కడుక్కోవాలి. నిమ్మరసంతో కూడా ఇలాంటి ఫలితమే కనిపిస్తుంది. వీటితో పాటూ కుళాయిలకు లవణాలను తొలగించే పరికరాలను అమర్చుకోవడం వల్ల జుట్టు సంబంధిత సమస్యలను నివారించవచ్చు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు