చిరిగిన జీన్స్‌ ఫ్యాషన్‌ అలా మొదలైంది!

చిరిగిన జీన్స్‌(రిప్‌డ్‌ జీన్స్‌) ప్యాంట్‌ వేసుకున్న ఓ మహిలను ఉద్దేశించి ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌సింగ్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశంలో సంచనలం సృష్టించాయి. ఇటీవల దెహ్రాడూన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఓ సారి విమానంలో తన పక్కన కూర్చున్న ఓ మహిళ చిరిగిన జీన్స్‌

Updated : 21 Mar 2021 18:07 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరిగిన జీన్స్‌(రిప్‌డ్‌ జీన్స్‌) ప్యాంట్‌ వేసుకున్న ఓ మహిళను ఉద్దేశించి ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌సింగ్‌ చేసిన వివాదస్పద వ్యాఖ్యలు దేశంలో సంచనలం సృష్టించాయి. ఇటీవల దెహ్రాడూన్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ ఓ సారి విమానంలో తన పక్కన కూర్చున్న ఓ మహిళ చిరిగిన జీన్స్‌ ధరించిందని, ఆమె ఇద్దరు పిల్లల తల్లి.. పైగా ఒక ఎన్జీవో నడిపిస్తోందని చెప్పారు. అలాంటి మహిళా ఇలాంటి వస్త్రధారణతో సమాజానికి ఏం సందేశం ఇస్తుందని ప్రశ్నించారు. దీంతో మహిళలంతా ఉత్తరాఖండ్‌ సీఎం వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. నెట్టింట్లోనూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో ఫ్యాషన్‌ ప్రపంచంలో ఎంతో పాపులరైన చిరిగిన జీన్స్‌ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. అయితే, అసలు ఈ చిరిగిన జీన్స్‌ ఎలా మొదలైందో తెలుసా? 

ప్రస్తుతం ఫ్యాషన్‌ బ్రాండ్‌గా మారిన ఈ చిరిగిన జీన్స్‌లు ఒకప్పుడు పేదరికానికి ప్రతీకగా ఉండేవంటే నమ్మగలరా?కానీ ఇదే నిజం. దీని గురించి తెలుసుకోవాలంటే ముందుగా జీన్స్‌ తయారీ గురించి తెలుసుకోవాలి. 1871లో జాకబ్‌ డబ్ల్యూ. డెవిస్‌ అనే అమెరికన్‌ టైలర్‌ తొలిసారి జీన్స్‌ను తయారు చేశాడు. ఆ కాలంలో పారిశ్రామీకరణ పెరగడంతో కార్మికులు పరిశ్రమల్లో గంటల తరబడి పనిచేసేవారు. అక్కడి వాతావరణానికి తగ్గట్టు కార్మికుల కోసం మన్నికైన దుస్తులు తయారు చేయాలన్న సంకల్పంతో జీన్స్‌ ప్యాంట్లను ఆవిష్కరించాడు. లెవి స్ట్రాస్‌ అనే వ్యాపారవేత్తతో కలిసి లెవి స్ట్రాస్‌ అండ్‌ కో బ్రాండ్‌తో పెద్దమొత్తంలో జీన్స్‌ తయారీ ప్రారంభించారు. కార్మికులు ఈ జీన్స్‌ ప్యాంట్లను కొనుగోలు చేసి ఏళ్లతరబడి వాటినే ధరించేవారు.

పాప్‌కల్చర్‌లో జీన్స్‌

1950ల్లో పాప్‌ సంస్కృతి పుట్టుకొచ్చింది. కార్మికులు వేసుకునే జీన్స్‌ దుస్తులనే మార్పులు చేసి పాప్‌ సింగర్లు, సినీ ప్రముఖులు వేసుకోవడం మొదలుపెట్టారు. సెలబ్రిటీల వస్త్రధారణను అభిమానులు కూడా ఫాలో అవుతారు కాబట్టి.. జీన్స్‌ ప్యాంట్లు ఫ్యాషన్‌గా మారిపోయాయి. ప్రపంచమంతా జీన్స్‌ పాపులర్‌ కావడంతో వాటి ధరలు బాగా పెరిగాయి. దీంతో ఎవరికోసమైతే జీన్స్‌ ఆవిష్కరించారో వారికే అవి దూరమయ్యాయి. ఏళ్లతరబడి ధరించడం, అనేకసార్లు ఉతకడం వల్ల జీన్స్‌ ప్యాంట్లు చిరిగిపోయేవి. కొత్త జీన్స్‌కొనే ఆర్థిక స్థోమత లేక కార్మికులు చిరిగిన జీన్స్‌ ప్యాంట్లే ధరించే పనులకు వెళ్లేవారు. కొందరు చిరిగిన చోట దారంతో కుట్టుకునేవాళ్లు. దీంతో చిరిగిన జీన్స్‌ వేసుకున్న వాళ్లు కటిక పేదరికంలో ఉన్నవాళ్లుగా ముద్రపడింది. ఈ క్రమంలో చిరిగిన జీన్స్‌ వేసుకున్న వారిపై సమాజంలో వివక్ష పెరిగిపోయింది.

పంక్‌ ఫ్యాషన్‌లో చిరిగిన జీన్స్‌

ఏ విషయాన్నైనా వ్యతిరేకించే స్వేచ్ఛ మనకుంటుంది. అప్పటి పెట్టుబడిదారి వ్యవస్థ, గుత్తాధిపత్యం, కార్పొరేట్‌ వ్యవస్థ, సిద్ధాంతాలు, ఫ్యాషన్‌, కళ, నృత్యం, సినిమా, సాహిత్యం ఇలా అన్ని విషయాలను వ్యతిరేకించేవారు కూడా చాలా మంది ఉండేవాళ్లు. అలాంటి వాళ్లను ఏకం చేస్తూ పంక్‌ సంస్కృతి ఆవిర్భవించింది. జీన్స్‌ కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పేదవాళ్లను చులకనగా చూస్తున్న సమాజం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసేవాళ్లు. అందుకే, సమాజంపై కోపం, నిరసనకు ప్రతీకగా పంక్‌ రాక్‌ బ్యాండ్‌ సభ్యులు జీన్స్‌ ప్యాంట్లను కొనుగోలు చేసి వాటిని చింపి ధరించేవాళ్లు. బీటిల్స్‌, రామొనోస్‌ వంటి రాక్‌స్టార్స్‌ చిరిగిన జీన్స్‌ ధరించడంతో ఇదో ఫ్యాషన్‌గా తయారైంది. దీంతో కంపెనీలు చిరిగిన జీన్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. ఆ తర్వాత వాటితోపాటు అనేక రకాల జీన్స్‌లు అందుబాటులోకి వచ్చాయి. నెమ్మదిగా చిరిగిన జీన్స్‌ ఫ్యాషన్‌ కనుమరుగైంది. 2010 తర్వాత మళ్లీ ఫ్యాషన్‌ ప్రపంచంలోకి ఈ చిరిగిన జీన్స్‌ అడుగుపెట్టాయి. డీజిల్‌, బాల్మెయిన్‌ తదితర కంపెనీలు చిరిగిన(రిప్‌డ్‌) జీన్స్‌ను ‘డిస్ట్రెస్‌డ్‌’ జీన్స్‌ పేరుతో ఫ్యాషన్‌ షోల్లో ఉపయోగించాయి. ఆ తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అలా.. ఒకప్పుడు చిరిగిన జీన్స్‌ వేసుకుంటేనే చులకనగా చూసే వాళ్లు.. ఇప్పుడు జీన్స్‌ ఎంత చిరిగితే అంత ఫ్యాషన్‌గా భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని