JEE Main 2023: జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులొచ్చేశాయ్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు (JEE Main Admit Cards) త్వరలో విడుదల కానున్నాయి. అడ్మిట్‌ కార్డులను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

Published : 21 Jan 2023 16:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE Main 2023)కు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. తొలుత ఈ నెల 24వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను jeemain.nta.nic.in వెబ్‌సైటులో ఉంచింది. 25వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఆదివారం విడుదల చేయనుంది. మిగిలిన తేదీల్లో పరీక్షల అడ్మిట్‌కార్డులను వరుసగా విడుదల చేయనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.

తొలుత విడుదల చేసిన షెడ్యూల్‌  ప్రకారం జనవరి 24, 25, 27, 28 ,29, 30, 31వరకు పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలపగా.. ఇటీవలే షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది. బీఈ, బీటెక్‌ విభాగాల్లో జేఈఈ మెయిన్‌ తొలి విడత పరీక్ష (పేపర్‌ 1, రెండు షిఫ్టుల్లో)  జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, జనవరి 28న బీఆర్క్‌, బీ ప్లానింగ్‌ విభాగంలో పేపర్‌-2ఏ, 2బీ పరీక్ష (మధ్యాహ్నం షిఫ్ట్‌‌లో) జరుగుతుందని పేర్కొంది. ఇప్పటికే పరీక్షలు జరిగే నగరాల వివరాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టీఏ స్పష్టంచేసింది.

దేశంలోని ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీ, ఇతర విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో (BE/Btech/BArch,etc) ప్రవేశాల కోసం ఏటా నిర్వహిస్తున్న జేఈఈ మెయిన్‌ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు రాస్తుంటారు. మెయిన్‌లో అర్హత సాధించిన వారికి అడ్వాన్స్‌లో నిర్వహిస్తారు. అందులో వచ్చే ర్యాంక్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తున్న ఎన్‌టీఏ.. రెండో విడత పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించనుంది.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ ఇలా..

  • jeemain.nta.nic.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి.
  • హోంపేజీలో జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు 2023 సెషన్‌-1కు సంబంధించి లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • మీ అప్లికేషన్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్‌ అవ్వాలి.
  • జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డు స్క్రీన్‌పై కనబడుతుంది.
  • ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఓ కాపీని ప్రింటవుట్‌ తీసుకుని పెట్టుకోవాలి.
  • కార్డుపై మీరు పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోండి.
  • ఏదైనా సమస్య ఉంటే jeemain@nta.ac.in. ద్వారా ఎన్‌టీఏకి ఇ-మెయిల్‌ చేయొచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని