Published : 01 Jul 2022 02:04 IST

Health: మత్తు వ్యసనాలను వదిలించుకోండి ఇలా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మత్తు గమ్మత్తును ఇస్తుంది. ఆ ఆనందడోలికల్లో విహరించే వారి సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కొంతమంది బానిసలుగా మారితే..మరికొంతమంది సరదాకు వెళ్లి ఉచ్చులో పడుతున్నారు. చివరికి జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఛిన్నాభిన్నం అవుతున్నారు. భవిష్యత్తును కోల్పోయి యువత ఆగం అవుతోంది. మద్యం, గంజాయి, డ్రగ్స్‌ వినియోగంతో జీవితాలను పాడు చేసుకునే వారు అధికం అవుతున్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నుంచి బయట పడేందుకు అనేక మార్గాలున్నాయి. మత్తుకు ఎలా వీడ్కోలు పలకాలో క్లినికల్‌ సైకియాట్రిస్టు కల్యాణ్‌ చక్రవర్తి వివరించారు. 

వ్యవసంగా ఎలా మారుతుంది 

ఏదైనా ఒక పనికి అలవాటు పడి వ్యసనంగా మార్చుకునే వయసు 15 నుంచి 28 ఏళ్ల వరకుంటుంది. ఈ సమయంలో చాలా మంది మార్పు కోరుకుంటారు. యుక్త వయసులో అనుభవించే వాటిపై దృష్టి పెడుతారు. అందరికంటే భిన్నంగా ఉండాలనే అభిలాష మొదలవుతుంది. ఆసక్తి, కుతూహలంతో కొత్త రుచులను ఆస్వాదించేందుకు సిద్ధమవుతారు. ఇందులో మత్తు పదార్థాల దరి చేరుతారు. కొంతమంది మిత్రులతో చెడుసావాసాలకు వెళ్తారు. ఇలాంటప్పుడే మాదకద్రవ్యాలు, దొంగతనాలు, తప్పు చేసి డబ్బు సంపాదించాలనే ధ్యాస మొదలవుతుంది. చదువు, భవిష్యత్తు గాలికి వదిలేసి వ్యసనాలకు తప్పుడు మార్గం ఎంచుకుంటారు. కొంతమంది తొందరగానే దురలవాట్లను వదిలించుకుంటారు. కొంతమంది బానిసలుగా మారిపోతారు.  

మత్తు పదార్థాలు ఏం చేస్తాయంటే 

మత్తు పదార్థాలు తీసుకున్న వారు చాలా అద్భుతంగా ఉందని భావిస్తుంటారు. ఆలోచన శక్తిని హరింపజేస్తుంది. చేయాల్సిన పనిని వాయిదా వేసేలా ప్రేరేపిస్తుంది. ఆకలి వేయదు. ఒళ్లంతా వణుకుతుంది. గుండెదడగా ఉంటుంది. బీపీ పడిపోతుంది.. లేదంటే పెరుగుతుంది. బరువు తగ్గిపోతారు. ఏకాగ్రత ఉండదు. నిద్ర పట్టదు. ఆందోళన ఎక్కువగా ఉంటుంది. జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. చికాకు, కోపం అధికం అవుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనిపించడం లేదంటే ఉన్మాదిగా మారే లక్షణాలు కనిపిస్తాయి. శారీరక వ్యాధులు చుట్టుముడుతాయి. 

ఇలా చేస్తే దూరంగా ఉండొచ్చు

* మద్యం, డ్రగ్స్‌ ఏదైనా వదిలించుకోవాలంటే గట్టి సంకల్పం అవసరం. అవరోధాలు ఎన్ని వచ్చినా కుటుంబ సభ్యులు, మంచి మిత్రుల సాయం తీసుకొని వైద్యుల దగ్గరకు వెళ్లాలి. 

* వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నామో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. జీవితంలో కోల్పోయిన వాటిని గుర్తు చేసుకోవాలి. 

* సమస్యలు, ఇబ్బందులుంటే వక్రదారిలో పరిష్కరించుకోలేం. కష్టపడి వాటికి పరిష్కార మార్గాలను వెదుక్కోవాలని గుర్తు పెట్టుకోవాలి.

* తల్లిదండ్రులు యుక్తవయసు పిల్లలతో సఖ్యతగా ఉండాలి. దారితప్పుతున్న తీరును గమనించాలి. యువత అభిప్రాయాలను గౌరవించి చక్కని మార్గంలోకి వెళ్లేలా సూచించాలి. వాళ్లకు గైడ్‌గా మారాలి.

* వ్యసనాలను వదిలించుకోవడానికి కౌన్సిలింగ్‌, యోగా, మెడిటేషన్‌ చేయాలి. కొంతమందికి మందులతో కూడా నయం చేయడానికి వీలుంది. తల్లిదండ్రులు అండగా ఉంటే వాళ్లను 95 శాతం బాగు చేయడానికి అవకాశం ఉంది. మత్తుమందు, మద్యం,సిగరెట్లను మాన్పించేందుకు మందులు అందుబాటులో ఉన్నాయి.


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని