Corona:‘బ్లాక్‌ ఫంగస్‌’ను ఎదిరించండిలా!

కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా చాలా మందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవడం లేదు. ‘బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌’రూపంలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.  కొవిడ్‌-19ను జయించిన వారిలో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. దిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్‌ను  గుర్తించారు. ఈ సమస్య మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ...

Updated : 10 May 2021 17:04 IST

ఇంటర్నెట్‌డెస్క్: కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నా చాలా మందికి ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవడం లేదు. ‘బ్లాక్‌ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌’రూపంలో మళ్లీ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.  కొవిడ్‌-19ను జయించిన వారిలో ఎక్కువగా దీని ప్రభావం కనిపిస్తున్నట్లు వైద్యులు గుర్తించారు. దిల్లీ, అహ్మదాబాద్ తదితర చోట్ల ఈ ఫంగస్‌ను  గుర్తించారు. ఈ సమస్య మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌  (ఐసీఎంఆర్‌) సంయుక్తంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేశాయి. వీటిని కచ్చితంగా పాటిస్తే ఈ ఇన్‌ఫెక్షన్‌ నుంచి బయటపడవచ్చని చెబుతున్నాయి. అయితే ఈ ఫంగస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్‌ఫంగస్‌ సోకిందని తెలుసుకోవడం ఎలా?

బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారిలో చాలా వరకు కొవిడ్‌-19 లక్షణాలే కనిపిస్తాయి. ఒళ్లునొప్పులు, కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రబారిపోవడం, జ్వరం, తలనొప్పి, జలుబు, దగ్గు, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, వాంతులైతే రక్తపు జీరలు పడటం, మానసిక స్థితిని కోల్పోవడం, శరీరంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా మారిపోవడం, గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటే మళ్లీ బయటపడటం తదితర లక్షణాలు కనిపిస్తే బ్లాక్‌ ఫంగస్‌ సోకిందని అనుమానించాలి.  

ఏం చేయాలి?

* రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవాలి

* కరోనా నుంచి కోలుకున్నా.. ఎప్పటికప్పుడు చక్కెర స్థాయులను పరీక్షించుకోవాలి.

* సమాయానికి, సరైన మోతాదులో డాక్టర్లు సూచించిన స్టెరాయిడ్లను మాత్రమే వాడాలి.

* ఆక్సిజన్‌ థెరపీ సమయంలో తేమ కోసం పరిశుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి.

* డాక్టర్లను సూచన మేరకు యాంటీబయోటిక్స్‌, యాంటీఫంగల్‌ ఔషధాలను తీసుకోవచ్చు.

ఏం చేయకూడదు?

* చిన్నపాటి లక్షణాలు కనిపించినా ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. వెంటనే డాక్టరును సంప్రదించాలి.

* కొవిడ్‌19 నుంచి కోలుకున్న తర్వాత సాధారణ జలుబు చేసినా చాలా మంది హైరానా పడిపోతుంటారు. జలుబు, ముక్కుదిబ్బడం  ఫంగస్‌ కారణంగానే వచ్చిందని అతిగా భయపడవద్దు. 

* ఫంగస్‌ను గుర్తించేకు అవసరమైన పరీక్షలకు ఏమాత్రం సంకోచించవద్దు. లక్షణాలు తీవ్రం కాకముందే కేవోహెచ్‌ స్టెయినింగ్‌ అండ్‌ మైక్రోస్కోపీ తదితర నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి.

* చికిత్సకు వెళ్లకుండా కీలక సమయాన్ని వృథా చేయవద్దు

నిరోధించడం ఎలా?

* బహిరంగ ప్రదేశాలు, దుమ్ముదూళి ఉన్న ప్రాంతాల్లోకి వెళ్తే తప్పని సరిగా మాస్కు ధరించాలి.

* వీలైనంత వరకు శరీరం మొత్తం కప్పి ఉంచేలా పొడవాటి దుస్తులు ధరించాలి. చేతులకి గ్లోవ్స్‌, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి.

* వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి.

కరోనా బాధితుల్లో ఎలాంటి లక్షణాలుంటాయ్‌!

* ముక్కు దిబ్బడం, ముక్కు నుంచి రక్తపు జీరలు రావడం, ఒళ్లు నొప్పులు, దవడ ఎముక బాధపెట్టడం, పార్శ్వనొప్పి.

* ముఖం వాపు

ముక్కు నల్లబడటం

* పంటినొప్పి, దంతాలు కదిలిపోవడం

* కళ్లు నొప్పి, చూపు మందగించడం, జ్వరం, చర్మం పాలిపోవడం

ఛాతినొప్పి, శ్వాసకోశ ఇబ్బందులు పెరిగిపోవడం తదితర లక్షణాలు కనిపిస్తాయి.

అసలేమిటీ ఫంగస్‌..?

 మ్యూకోర్‌మైకోసిస్‌’గా పిలిచే ఈ రుగ్మత వల్ల బాధితుడికి ప్రాణాపాయం తలెత్తవచ్చు. వాతావరణంలో సహజంగానే ఉండే మ్యూకోర్‌ అనే ఫంగస్‌ వల్ల ఇది వస్తుంది. అరుదుగా మనుషులకు సోకుతుంటుంది. ముఖ్యంగా కొవిడ్‌ సోకిన వారిలో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి లేదా మితిమీరి స్పందించకుండా రోగనిరోధక వ్యవస్థను కట్టడి చేయడానికి స్టెరాయిడ్స్‌ వినియోగించిన వారికి ఇది ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారికీ దీని ముప్పు ఎక్కువే. గాలి పీల్చుకొన్నప్పుడు ఈ ఫంగస్‌ ఊపిరితిత్తుల్లో, సైనస్‌ వద్ద చేరుతుంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు