Health: చిన్నారుల అత్యవసర పరిస్థితులపై పెద్దలు ఓ కన్నేయండి..!

పసి పిల్లలు..బోసి నవ్వులున్న ఆ ఇంటా సందడే వేరు. వాళ్ల అల్లరి, ఆటలు చూసి సంతోషంతో పెద్దలు మురిసిపోతారు. ఉన్నట్టుండి ఆ చిన్నారులు ఏడుస్తూ మెలికలు తిరిగిపోతుంటే తట్టుకోలేం. వాళ్లకేమయ్యిందోనని ఆందోళన చెందుతాం

Published : 24 Jun 2022 01:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పసి పిల్లలున్న ఇంట ఆ సందడే వేరు. వాళ్ల అల్లరి, ఆటలు చూసి సంతోషంతో పెద్దలు మురిసిపోతారు. ఉన్నట్టుండి ఆ చిన్నారులు ఏడుస్తూ మెలికలు తిరిగిపోతుంటే తట్టుకోరు. వాళ్లకేమయ్యిందోనని ఆందోళన చెందుతారు. పసిపిల్లల్లో వచ్చే సమస్యలు తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. కొన్ని రకాల జబ్బులకు పెద్దలు తొందరగా స్పందించకపోతే ప్రాణాంతకంగా మారుతుంది. పిల్లల్లో కనిపించే అత్యవసర పరిస్థితి గురించి చీఫ్‌ ఆఫ్‌ పిడియాట్రిక్‌ పీవీ రామారావు పలు జాగ్రత్తలు సూచించారు.

తల్లిదండ్రులు అప్రమత్తం కావాల్సిందే

చిన్నారులకు సీజన్‌ మారినప్పుడల్లా కొన్ని రకాల సమస్యలు వస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఫిట్స్‌, ఊపిరాడకపోవడం, ఆయాసం లాంటి సమస్యలపై తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. ఊపిరితిత్తులకు నిమ్ము, ఆస్తమా, గుండె సంబంధ సమస్యలు, అతిసారం, శ్వాసకోశ వ్యాధులు, మెదడుకు సంబంధించిన ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటిలో జ్వరం, వాంతులు లాంటివి కామన్‌గా కనిపిస్తాయి.

వర్షకాలంలో జాగ్రత్త సుమా

వర్షకాలంలో ఎక్కువగా ఛాతీ సంబంధ జబ్బులు వస్తాయి. ఛాతీ ఇన్‌ఫెక్షన్‌ వస్తే ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించాలి. కొన్నిసార్లు ఆక్సిజన్‌ కూడా అందించాల్సి వస్తుంది. పాలు తాగలేకపోతే పైపు వేసి పట్టాలి. ఆస్తమా తీవ్రంగా ఉన్నపుడు ఆక్సిజన్‌ మీద పెట్టాల్సిందే. ఆవిరి పట్టాలి. ఇన్‌హేలర్స్‌ వాడక తప్పదు.

ఫిట్స్‌ వస్తే ఏం చేయాలి

పిల్లలకు ఫిట్స్‌ వస్తే తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతారు. జ్వరం వచ్చినపుడు చిన్నారుల నాడీ వ్యవస్థ చికాకుకు గురవుతుంది. ఆ సమయంలో ఫిట్స్ వస్తుంది. వీటితో ఆందోళన అవసరం లేదు కానీ జ్వరం తీవ్రంగా ఉన్నపుడు తడిబట్టతో ఒళ్లంతా తుడవకపోతే నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఫిట్స్‌ వస్తుంది. ఈ సమయంలో తాళాలు, ఇనుప వస్తువులు పిల్లల నోట్లో, చేతుల్లో పెట్టొద్దు. సాధారణంగా రెండు, మూడు నిమిషాల్లో ఫిట్స్‌ తగ్గిపోతుంది. అయినా కూడా పిల్లలను ఆసుపత్రికి తీసుకెళ్లాలి. కొన్నిసార్లు పిల్లల్లో మెదడువాపు వ్యాధి కనిపిస్తుంది. మెదడు వాపు వ్యాధి అయితే జ్వరం, తలనొప్పి, వాంతులు, నీరసం, ఫిట్స్‌ వస్తాయి. కొంతమంది పిల్లలు కోమాలోకి కూడా వెళ్తారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే అన్ని రకాల పరీక్షలు చేసి నిర్థారణ చేయాల్సి వస్తుంది.

వాంతులు, విరేచనాలయితే..

వాతావరణంలో మార్పులతో చిన్నారులకు రకరకాల సమస్యలు వస్తాయి. ఆహారం, నీరు కలుషితం కావడంతో వాంతులు, విరేచనాలవుతాయి. తరచుగా ఈ సమస్య ఉన్నట్లయితే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నీరు, లవణాల శాతం తగ్గిపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలస్యం చేసే కొద్దీ పిల్లల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. మూత్రం సరిగా రాకపోవడం, పెదవులు ఎండిపోవడంతో అతిసారం వచ్చినట్టు గుర్తించాలి. ఆ సమయంలో ఫ్లూయిడ్స్‌ ఇవ్వక తప్పదు. ఓఆర్‌ఎస్‌, కొబ్బరినీరు తాగించాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని