Health Tips: వ్యాయామం చేయకున్నా బరువు తగ్గవచ్చు!

ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలని రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు.

Published : 29 Apr 2022 02:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. బరువు తగ్గాలని రకరకాల పద్ధతులను అవలంబిస్తున్నారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరినీ వెంటాడుతున్న సమస్యలాగా మారిందీ ఊబకాయం. బరువు తగ్గాలనుకుంటున్నానండీ ఏదైనా సలహా ఇవ్వరూ..అని అనగానే చాలామంది చెప్పే సమాధానం వ్యాయామం చేయండి అని అంటారు. నిజమే వ్యాయామంతో అనేక లాభాలున్నాయి. కానీ మాకు అంత సమయం లేదండీ అనుకుంటున్నారా! అయితే మీ రోజూవారి ఆహారంలో, చేసే పనుల్లో కాస్త మార్పులు చేసుకోండి. సులువుగా బరువు తగ్గండి.

నీటితో పొట్ట నింపేయండి

సాధారణ రోజుల కంటే వేసవిలో శరీరం చెమట రూపంలో ఎక్కువ నీటిని కోల్పోతుంది. అందుకే ఈ సమయంలో బరువు తగ్గడం మరింత సులువు. ఎండకు డీహైడ్రేషన్‌కు గురవుతారు. అందుకే వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలి. దీనివల్ల పొట్టనిండినట్లు అయ్యి మీరు తక్కువ ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశముంటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోరు కాబట్టి బరువు తగ్గుతారు. నీటికి బదులుగా నిమ్మరసం, కొబ్బరినీళ్లు తీసుకుంటే ఆహారంతో తీసుకోకున్నా శక్తిని కోల్పోకుండా ఉంటారు. 

సీజనల్‌ పండ్లకు, కూరగాయలకు అధిక ప్రాధాన్యత

సీజనల్‌గా దొరికే పండ్లు కూరగాయలకు అధికంగా ప్రాధాన్యమివ్వండి. వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌ బరువు తగ్గడానికి తోడ్పడుతాయి. వేసవిలో దొరికే పుచ్చకాయ, ఖర్బుజా, తాజా దోసకాయలను తీసుకోవచ్చు. 

వీటికి దూరంగా ఉండండి

ఆల్కాహాల్‌కు, కాఫీ, టీ, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. సహజ సిద్ధంగా చేసే  పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి.

డైట్‌లో ఇవి తప్పనిసరి

మీరు తీసుకునే ఆహారంలో పెరుగును చేర్చుకోండి. ఇది మీ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీంతో పాటు విటమిన్‌ ‘డి’, ప్రొటీన్స్‌, కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 

రాత్రి భోజనం మితంగా...

రాత్రి సమయంలో వీలైనంత మితంగా తినాలి. సూప్‌లు, సలాడ్‌లతో పరిమితమైతే మంచిది. ఎక్కువగా ఆహారం తీసుకుంటే జీర్ణమవడానికి ఆలస్యమవుతుంది. దీంతో జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. అందుకే తేలికపాటి ఆహారాన్ని తీసుకోవాలి. 

డీప్‌ ఫ్రైలకు దూరంగా... 

సాధారణంగా అందరూ ఫ్రైలను ఇష్టపడుతారు. ఇవి జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. వీటిని తినడం ద్వారా శరీరంలో కొవ్వు నిల్వ ఉంటుంది. దీంతో బరువు పెరుగుతారు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు కాస్త వీటికి దూరంగా ఉండాల్సిందే.

ఇలా రోజూ తీసుకొనే ఆహారంలో కొన్ని కొన్ని మార్పులు చేసుకొని వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే సులభంగా బరువు తగ్గవచ్చు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని