Recycling: పాత వస్తువులను పడేస్తున్నారా? ఇలా ఉపయోగించండి!

నవరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇంటి ఇల్లాలికి పని మరింతవుతుంది. ఇంటిని శుభ్రం చేయడం, రంగులు వేయడం, ఆకర్షణీయంగా అలంకరించడం వంటివి ఎన్నో పనులు ఉంటాయి. ఈ క్రమంలో పాత వస్తువులను ఏం చేయాలి?  అనే ఆలోచన వస్తుంది.

Published : 06 Oct 2022 10:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పండగల వేళ ఇంటిని శుభ్రం చేయడం, రంగులు వేయడం, ఆకర్షణీయంగా అలంకరించడం ఒక కళ. ఈ క్రమంలో పాత వస్తువులను ఏం చేయాలి?  అనే ఆలోచన వస్తుంది. అయితే కొత్తగా ఆలోచిస్తే ప్రతి వస్తువును ఆకర్షణీయంగా మార్చవచ్చు. విభిన్న ఆలోచనలతో పాత వాటిని పడేయకుండా ఇంటిని ఎలా అలంకరించుకోవాలో తెలుసుకోండి.

* ఇంట్లో మిగిలిన పాత గాజు సీసాలను పూల కుండీలుగా మార్చేయడం చాలా సులువు. మీ అభిరుచిని బట్టి వాటికి రంగులేసి, మరింత సమర్థంగా ఉపయోగించవచ్చు. వీటిల్లో జీరో వోల్ట్‌ బల్బులు ఉంచితే మరింత ఆకర్షణగా ఉంటుంది. వీటిని బాల్కనీలో వేలాడదీసినట్లుగా పెట్టండి.

* పాత టైర్లను బయటపడేయకుండా వాటిని మనకు నచ్చిన రీతిలో వాడుకోవచ్చు. వాటిని మట్టితో నింపి అందులో అందమైన పూల మొక్కలు పెంచవచ్చు. చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. వీలైతే వాటికి కాస్త రంగులద్దితే ఆకర్షణీయంగా ఉంటాయి. 

* కిచెన్‌లో ఎన్నో పాత్రలు పాడైనవి ఉండిపోతాయి. వీటిని పారేయలేరు. అలా అని వాడలేరు. అలాంటి వాటిల్లో కూడా మట్టి నింపి చిట్టి మొక్కలు పెంచుకోవచ్చు.  

* ప్రస్తుతం మార్కెట్లో రకరకాల డిజైన్లలో మొక్కలు పెట్టేందుకు స్టాండులు వస్తున్నాయి. మన ఇంట్లో పాత సైకిల్‌, కిచెన్‌లో వాడే స్టాండులు ఇలా ఎన్నో అవసరం లేనివి మూలన పడేస్తుంటారు. వీటిని ఎందుకు ఉపయోగించుకోకూడదు? మీ గార్డెన్‌లో వీటిపై మొక్కలు పెట్టి పెంచుకోవచ్చు.  

* ఇంటికి అందాన్ని పెంచేవాటిల్లో కర్టెన్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కానీ వీటిని బయటనుంచి ఎందుకు కొనాలి? ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? ఇంట్లో ఎలా తయారు చేస్తారు అని అంటారా? చేయవచ్చు. ఇంట్లో వాడకుండా పక్కన పెట్టిన చీరలను కర్టెన్‌లలా కుట్టేయండి. రంగు ఉన్నవి, కాస్త డిజైన్‌ ప్రత్యేకంగా ఉన్న చీరలను కుషన్లకు కవర్లుగా వాడవచ్చు. 

మనం నివసించే ప్రాంతంలో సానుకూల వాతావరణం ఉంటే మన ఆలోచనలు కూడా సానుకూలంగానే ఉంటాయి. అందువల్ల ఇంటిని మీకు నచ్చినట్లు అలంకరించుకోండి. వాడకుండా పక్కన పెట్టిన ప్రతి వస్తువును తిరిగి ఎలా ఉపయోగించవచ్చో ఆలోచించండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని