AP: కరోనాతో 73 మంది మృతి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనాతో బాధపడుతూ గత 24 గంటల్లో 73మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు.

Updated : 07 May 2021 19:20 IST

అమరావతి: కరోనాతో బాధపడుతూ తాజాగా 73మంది మృతి చెందారని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి అనిల్‌ సింఘాల్‌ తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితిపై శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత 24 గంటల్లో 1,00,424 కరోనా పరీక్షలు చేయగా, 17,188 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి విడత టీకాలకు ప్రస్తుతం అవకాశం లేదని, రెండో డోస్‌ టీకాలు తీసుకునే వారికే ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. త్వరలో మరో 3.50లక్షల డోసులు ఇచ్చేందుకు సీరం అంగీకారం తెలిపిందని వివరించారు. రాష్ట్రంలో రూ.180 కోట్లతో 49 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేశామని, ఆరోగ్యశ్రీ కార్డులున్న వారికి ప్రైవేటు ఆస్పత్రులలో ఉచితంగా వైద్యం అందిస్తామని వివరించారు. అదే విధంగా కొవిడ్‌ విధుల్లోని సిబ్బందికి వెయిటేజీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 12,45,374 మంది వైరస్‌ బారినపడగా, మొత్తం 1,71,60,870 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. కొవిడ్‌తో బాధపడుతూ గత 24 గంటల్లో విజయనగరంలో 11మంది మృతి చెందగా, విశాఖ 10, తూర్పుగోదావరి 8, చిత్తూరు 7, కృష్ణా 6, గుంటూరు 6, కర్నూలు 5, ప్రకాశం 5, పశ్చిమగోదావరి 5, నెల్లూరు 4, శ్రీకాకుళం 4, అనంతపురంలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజాగా 12,749మంది కరోనా నుంచి కోలుకోగా, మొత్తం 10,50,160మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు 2,260 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, అత్యల్పంగా ప్రకాశం 385 మంది కరోనా బారిన పడ్డారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని