Published : 07 Sep 2020 15:26 IST

చీమలూ శానిటైజ్‌ చేసుకుంటాయ్‌ తెలుసా..?

కరోనా మహమ్మారి విలయ తాండవం ఆరు నెలలుగా కొనసాగుతూనే ఉంది. ప్రపంచ దేశాలు ఈ వైరస్‌ కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రోజుకు లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ చర్యలు పక్కనబెడితే.. వ్యక్తిగతంగా ప్రజలు వ్యాధి నివారణకు ఏం చేస్తున్నారనేది ముఖ్య విషయం. ప్రస్తుతం వైరస్‌ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భౌతికదూరం పాటిస్తూ.. మాస్కులు ధరిస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయితే ఇలాంటి వ్యాధులు ప్రబలినప్పుడు చీమలు మనకన్నా తెలివిగా ప్రవర్తిస్తాయట. చీమల గుంపులో ఒకచీమకు వ్యాధి సోకినా ముందస్తు వ్యాధి నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేస్తాయట.

భూమిపై ఉన్న జీవ రాశుల్లో 15-20శాతం చీమలే ఉంటాయని అంచనా. ఇవి కూడా మనుషుల్లాగే సాంఘిక జీవితం సాగిస్తుంటాయి. కలిసిమెలిసి ఉంటూ వాటికంటూ ఓ గూడు ఏర్పాటు చేసుకుంటాయి. అతి తక్కువ స్థలంలో పెద్ద సంఖ్యలో గుమిగూడుతుంటాయి. అయితే అంటువ్యాధులు వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తగా కఠినమైన చర్యలు తీసుకుంటాయి. ఆ సమయంలో చీమల సమూహం వ్యవహరించే తీరులో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. 

భౌతిక దూరం పాటిస్తూ..

చీమలు భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటిస్తాయట. పరిశోధనలో భాగంగా పరిశోధకులు 11 చీమల సమూహాలపై వ్యాధికారకాలను వదిలారు. దీంతో ఒక సమూహంలోని చీమలు.. మరో సమూహంలోని చీమలను కలవడం మానేశాయట. ఇలా ఒక సమూహం మరో సమూహాన్ని కలవకపోవడం వల్ల వ్యాధి వ్యాప్తి చాలా వరకు తగ్గుతుంది. అలాగే వ్యాధి కారకాలు ఎంత తక్కువగా ఉంటే వ్యాధి సోకే అవకాశాలు అంత తక్కువగా ఉంటాయన్న విషయాన్ని చీమలు గ్రహించాయి. అందుకే ఇతర సమూహంలోని చీమలను కలవడానికి ఇష్టపడవు. అలాగే సొంత సమూహంలోని చీమలతో కూడా సంభాషించుకోవడం తగ్గించేస్తున్నాయట.

శానిటైజ్‌ చేస్తూ..

మనం బయటకి వెళ్లిరాగానే ముందుగా చేతుల్ని శానిటైజ్‌ చేసుకుంటాం. అలాగే చీమలు కూడా బయటకు వెళ్లి తిరిగి గూటికి చేరుకోగానే శానిటైజ్‌ చేసుకొని లోపలికి వెళ్తాయట. ఎలా అనుకుంటున్నారా? చీమలు ఫార్మిక్‌ యాసిడ్‌ అనే రసాయనాన్ని వదులుతుంటాయి. ఇది యాంటీమైక్రోబయల్‌ రసాయనంగా పనిచేస్తుంది. దీంతో చీమలు గూటి వద్దకు రాగానే ఒకదానిపై మరొకటి ఫార్మిక్‌ యాసిడ్‌ను చల్లుకుంటాయి. దీని వల్ల చీమలపై ఉండే వ్యాధికారకాలు నశిస్తాయి. గూడు లోపల కూడా తరచూ ఫార్మిక్‌ యాసిడ్‌ను చల్లి శుభ్రం చేసుకుంటాయట.

చిట్కాలు వాడుతూ..

చెట్టుకు ఉండే జిగురు పదార్థాలు యాంటీమైక్రోబయల్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. దీంతో జిగురు పదార్థంలో అవి వదిలే ఫార్మిక్‌ యాసిడ్‌ను కలిపి గూడును తయారు చేస్తాయట. దీని వల్ల ఎలాంటి వ్యాధి కారకాలు గూడునుదాటి లోపలకి రావు. అలాగే చీమలు వాటి గుడ్లచుట్టూ జిగురు పదార్థాలను కప్పి ఉంచుతాయి.  

కఠినంగా వ్యవహరిస్తూ..

వ్యాధిగ్రస్తుల్ని మనం ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తాం. వారు బతకాలని ప్రార్థిస్తాం. కానీ చీమలు తమ సమూహంలో ఎవరికైనా వ్యాధిసోకితే నిర్దాక్షిణ్యంగా బయటకు వెళ్లగొట్టడమో.. చంపేయటమో చేస్తాయట. రోగానికి గురైన వాటిని తమ సమూహంలో ఉండటానికి చీమలు ఏ మాత్రం అంగీకరించవు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌
 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని