KTR: బెంగళూరుతో పోటీ పడేలా హైదరాబాద్‌ను నిలబెట్టాం: కేటీఆర్‌

ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు.

Published : 05 Jun 2023 15:27 IST

హైదరాబాద్‌: ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. బెంగళూరుతో పోటీపడేలా హైదరాబాద్‌ను నిలబెట్టామని చెప్పారు. టీ-హబ్‌లో ఐటీశాఖ వార్షిక నివేదికను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. 2013-14లో హైదరాబాద్‌లో ఐటీ ఎగుమతులు రూ.56 వేల కోట్లుగా ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుతం రూ.1.8 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు సాధించామని తెలిపారు. ఐటీ రంగంలో కేంద్రం నుంచి సహకారమేమీ లేదని.. మాట సాయం తప్ప కేంద్రం ఎలాంటి అండదండలు అందించలేదన్నారు.

‘‘తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో రాష్ట్రాన్ని ఐటీ రంగంలో అగ్రస్థానంలో నిలబెడతామన్నప్పుడు అనేకమంది ఆశ్చర్యంగా చూశారు. అయినా ఈ రోజు దేశ ఐటీ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం సహాయనిరాకరణ చేసినా, ఈ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించగలిగాం. హైదరాబాద్ ఐటీ రంగానికి ఎంతగానో ఊతం ఇస్తుందనుకున్న ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసినా.. ఈ ప్రగతి సాధ్యమయ్యేలా చూడగలిగాం. దీంతోపాటు దాదాపు రెండేళ్ల పాటు కరోనా సంక్షోభం ఆ తర్వాత మారిన పరిస్థితులను కూడా దాటుకొని ఈ అభివృద్ధిని సాధించాం. గత కొన్నేళ్లుగా హైదరాబాద్ ఐటీ రంగ వృద్ధిలో అన్ని సూచీల్లో... జాతీయ సగటును దాటుకొని వేగంగా ముందుకెళ్తోంది. హైదరాబాద్ నగరాన్ని ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చగలిగాం. 

అమెరికాకు చెందిన క్వాల్‌కామ్‌, గ్రిడ్‌ డైనమిక్స్‌ సంస్థ సహా అనేక కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. నగరంలో పెట్టుబడి పెట్టేందుకు జర్మనీ కంపెనీ బాష్‌ ముందుకొచ్చింది. గూగుల్‌ కూడా ఇక్కడ అతిపెద్ద కేంద్రం నిర్మిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ డేటా సెంటర్‌ నగరానికి వస్తోంది. భారత్‌ కంపెనీ ఎల్‌టీఐ మైండ్‌ ట్రీ కంపెనీ వరంగల్‌లో పెట్టుబడులు పెడుతోంది. సైబర్‌ నేరాలు అరికట్టేందుకు సైబర్‌ క్రైమ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ తెస్తున్నాం. లండన్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ గ్రూప్‌ కేంద్రం ఈ ఏడాది వస్తుంది. మరో రెండేళ్లలో డజోన్‌ ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ వస్తోంది. ఐటీ రంగం దూసుకెళ్లేందుకు మా బృందం బాగా పనిచేస్తోంది’’ అని మంత్రి కేటీఆర్‌ వివరించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు