ఇప్పటికీ మాస్క్‌ లేకుండానే తిరుగుతున్నారా?

మాస్క్‌ లేకుండా తిరుగుతున్నారా?అయితే రూ.వెయ్యి జరిమానా కట్టేందుకు సిద్ధంకండి! దుకాణాల ముందు.. ఇతర బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించకుండా కొవిడ్‌ నిబంధనలు..

Published : 12 Apr 2021 01:24 IST

అయితే మీకు జరిమానా, కేసులు తప్పవ్‌!
హైదరాబాద్‌లో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టిన పోలీసులు

హైదరాబాద్‌: మాస్క్‌ లేకుండా తిరుగుతున్నారా?అయితే రూ.వెయ్యి జరిమానా కట్టేందుకు సిద్ధంకండి! దుకాణాల ముందు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో సామాజిక దూరం పాటించకుండా కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారా? అయితే మీపై కేసులు తప్పవ్‌! బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. పలుచోట్ల మాస్క్‌లు ధరించని వారిపై జరిమానాలు విధిస్తున్నారు.

హైదరాబాద్‌లో కొన్నిచోట్ల పోలీసులు రంగంలోకి దిగి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. వైన్‌ షాపులు, సూపర్‌ మార్కెట్లు, ఇతర ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించని వ్యక్తులకు రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు. మరికొన్ని చోట్ల అంటు వ్యాధుల నియంత్రణ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సనత్‌నగర్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటించని దుకాణాలు, మద్యం షాపులపై ఇన్‌స్పెక్టర్‌ ముత్తు యాదవ్‌ విపత్తు నివారణ చట్టం కింద మూడు కేసులు నమోదు చేశారు. మాస్క్‌ ధరించని 13 మందికి జరిమానా విధించారు. మాస్క్‌లు ధరించని, కొవిడ్‌ నిబంధనలు పాటించని దుకాణదారులకు అవగాహన కల్పించిన పోలీసులు.. వారితో ప్రమాణం చేయించారు. 

కూకట్‌పల్లి ప్రాంతంలో మాస్క్‌ ధరించని 65 మందికి అక్కడి పోలీసులు జరిమానాలు విధించారు. మేడ్చల్‌ పరిధిలో కొవిడ్‌ నిబంధనలు పాటించకుండా రోడ్లపై తిరుగుతున్న 10 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారు. నిబంధనలు పాటించని వస్త్ర దుకాణాలు, మొబైల్‌ షాప్‌లు, వైన్‌ షాప్‌లపై అంటువ్యాధుల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద మేడ్చల్‌ పోలీసులు కేసులు నమోదు చేశారు. మరోవైపు మాస్కులు ధరించని 28 మందికి పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు జరిమానా విధించారు. 

చర్యలు తప్పవ్‌: మేడ్చల్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి

కొవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మాస్క్‌ ధరించకుండా, సామాజిక దూరం పాటించకుండా రోడ్లపై తిరిగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు ‘నో మాస్క్‌.. నో ఎంట్రీ’ బోర్డులు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మాస్క్‌ లేని వారిని లోనికి అనుమతించవద్దని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని మేడ్చల్‌ పోలీసులు సూచించారు. మాస్క్‌ లేకుండా రోడ్లపై కనిపిస్తే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తప్పవని మేడ్చల్‌ సీఐ ప్రవీణ్‌రెడ్డి హెచ్చరించారు. 

కుటుంబాన్నీ ఆపదలోకి నెట్టేద్దామా?

కరోనా నుంచి రక్షణ పొందేందుకు మాస్కులు పెట్టుకోవాలని వైద్యాధికారులు చెబుతున్నా కొందరు పట్టించుకోవడం లేదు. చాలా వరకు యువత మాస్క్‌ లేకుండా తిరుగుతున్నారు. ఒక వ్యక్తి నిర్లక్ష్యం అతడితో పాటు ఆయన కుటుంబాన్నీ.. తద్వారా చుట్టుపక్కల వాళ్లనీ ఆపదలోకి నెట్టేయొచ్చు. కొవిడ్‌ మహమ్మారి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని.. ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు