హైదరాబాద్‌ పోలీసులు దేశానికే ఆదర్శం

పోలీసులు హైదరాబాద్‌ మహానగరాన్ని శాంతిభద్రతలకు చిరునామాగా మార్చారని హెచ్‌ఐసీసీలో

Published : 30 Jan 2021 01:08 IST

ఎస్‌సీఎస్‌సీ 15వ వార్షికోత్సవంలో అతిథులు

హైదరాబాద్‌: పోలీసులు హైదరాబాద్‌ మహానగరాన్ని శాంతిభద్రతలకు చిరునామాగా మార్చారని హెచ్‌ఐసీసీలో జరుగుతున్న సొసైటీ ఫర్‌ సైబరాబాద్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ (ఎస్‌సీఎస్‌సీ) 15వ వార్షికోత్సవం అతిథులు కొనియాడారు. నేరాల కట్టడి, నియంత్రణలో తెలంగాణ పోలీసులు దేశానికే మార్గనిర్దేశకులుగా నిలుస్తున్నారని అభినందిస్తున్నారు. ఎస్‌సీఎస్‌సీ 15వ వార్షికోత్సవం డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌, రాచకొండ మహేశ్‌ భగవత్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, భారత్‌ బయోటెక్‌ జేఎండీ సుచిత్ర ఎల్ల సహా ఐటీ కంపెనీల ప్రతినిధులు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఈ నెల 13న కొవాగ్జిన్‌ను జీనోమ్‌ వ్యాలీ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్తున్నపుడు పోలీసులు చేపట్టిన బందోబస్తు, తీసుకున్న జాగ్రత్తలు రోమాలు  నిక్కబొడుచుకునేటట్టు చేశాయని సుచిత్ర ఎల్ల వ్యాఖ్యానించారు. మహిళలకు హైదరాబాద్‌ అత్యంత రక్షణాత్మక నగరంగా మారిందన్నారు. కొవిడ్‌ సమయంలో పోలీసులు ఇచ్చిన మద్దతుతో  లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయగలిగారని, ప్రముఖ పారిశ్రామిక వేత్త బీవీఆర్‌ మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సాంకేతిక వాడకంలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలోనే ముందున్నారని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.

కౌన్సిల్‌ పనితీరులో ఎలాంటి తేడా రాలేదు: డీజీపీ

‘‘ఐటీ కారిడార్‌లో భద్రత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేశాం. 15 సంవత్సరాల పాటు ఎంతో మంది ఛైర్మన్లు, ప్రధాన కార్యదర్శులు మారుతున్నా.. కౌన్సిల్‌ పనితీరులో ఎక్కడా ఎలాంటి తేడా రాలేదు. ఎస్‌సీఎస్‌సీని ఆదర్శంగా తీసుకొని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో సెక్యూరిటీ కౌన్సిల్‌లను ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో 99శాతం మంది చట్టానికి లోబడి ఉంటారు. చట్టాన్ని అతిక్రమించే ఒక్క శాతం మందిని గమనించేందుకు, వాళ్లపై చట్టపరంగా చర్యలు తీసుకోవడానికే పోలీసులు పనిచేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర రాజధానిలో 6.5లక్షల సీసీ కెమేరాలు ఏర్పాటు చేశాం. ప్రపంచ స్థాయిలో హైదరాబాద్ మిగతా నగరాల కంటే ముందుంది. టీఎస్ కాప్ యాప్‌ ద్వారా పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరినీ అనుసంధానించాం. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి దోషులను 24 గంటల్లో పట్టుకోగలుగుతున్నా’’ అని డీజీపీ మహేందర్‌ రెడ్డి తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని