Afghan crisis: అదే చివరి విమానం.. నేను అదృష్టవంతుడిని!

తమ దేశం నుంచి సురక్షితంగా బయటపడ్డానని, ఎంతో అదృష్టవంతుడినని దిల్లీకి చేరిన 20 ఏళ్ల అఫ్గాన్‌ విద్యార్థి అబ్దుల్లా పేర్కొన్నాడు. ఎయిర్‌ ఇండియా విమానంలో అతడు క్షేమంగా భారత్‌కు వచ్చాడు....

Updated : 18 Aug 2021 01:50 IST

దిల్లీ: అఫ్గానిస్థాన్ అట్టుడుకుతోంది. ఆ దేశాన్ని తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో ప్రాణ భయంతో స్థానికులు అఫ్గాన్‌ను వీడి ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. తమ దేశం నుంచి సురక్షితంగా బయటపడ్డానని, ఎంతో అదృష్టవంతుడినని దిల్లీకి చేరిన 20 ఏళ్ల విద్యార్థి అబ్దుల్లా పేర్కొన్నాడు. ఎయిర్‌ ఇండియా విమానంలో అతడు క్షేమంగా భారత్‌కు చేరుకున్నాడు. తాను ఎక్కిన విమానం టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే తాలిబన్లు కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నారని.. ఆ విమానం మిస్సయితే తన పరిస్థితి ఏమయ్యేదో అంటూ ఆందోళన వ్యక్తంచేశాడు.

అబ్దుల్లా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను నిద్ర లేవగానే.. తాలిబన్లు కాబుల్‌ను ఆక్రమించేందుకు వస్తున్నారనే వార్త చూశాను. దీంతో విమానాశ్రయానికి పయనమయ్యాను. రోడ్లపై చాలా ట్రాఫిక్ ఉంది. దీంతో వాహనంపై నుంచి దిగి నడుచుకుంటూనే ఎయిర్‌పోర్టుకు వెళ్లాను. నేను ఎక్కిన విమానంలో మొత్తం 129 మందిమి ఉన్నాం. అదే చివరి విమానం. అందులో దాదాపు అందరూ భారతీయులే. కానీ ఆ విమానం బయలుదేరుతుందో, లేదో అనే భయం.. సురక్షితమైన దేశానికి వెళ్లిపోతున్నానన్న ఆనందం.. కుటుంబాలను వీడి వెళ్లిపోతున్నాననే బాధ.. తాలిబన్లు ఈ ఫ్లైట్‌ను ఎక్కడ నిలిపివేస్తారేమోనన్న ఆందోళన.. ఇలా అనేక ఆలోచనలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి. విమానం టేకాఫ్‌ అయ్యాక అందరూ ఆనందంతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు’ అని అబ్దుల్లా వివరించాడు.

‘మా విమానం టేకాఫ్ అవ్వగానే కాబుల్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. నేను ఎక్కిందే చివరి విమానం. అది మిస్సయితే ఏమైయ్యుండేదో. నేను ఎంతో అదృష్టవంతుడిని. నేను ఏమైపోయానో అని నా కుటుంబం తీవ్ర ఆవేదనకు గురైంది. సోమవారం రాత్రి 8.30 గంటలకు విమానం దిల్లీకి చేరుకున్న తర్వాత మా వాళ్లతో మాట్లాడా. నా గొంతు విన్న తర్వాత వాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. నా కుటుంబం సురక్షితంగా ఉంటుందని భావిస్తున్నా’ అని అబ్దుల్లా పేర్కొన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని