Darshan: నేను రెండు దెబ్బలే కొట్టా.. పోలీసు విచారణలో నటుడు దర్శన్ వెల్లడి?

తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్‌ స్టార్‌- నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది.

Updated : 16 Jun 2024 10:09 IST

దర్శన్, పవిత్రా గౌడ

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : తన అభిమాని రేణుకాస్వామి (28)ని హత్య చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛాలెంజింగ్‌ స్టార్‌- నటుడు దర్శన్, ఆయనతో సహజీవనం చేస్తున్న నటి పవిత్రాగౌడలతో కలిపి తొమ్మిది మంది పోలీసు కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. కస్టడీ అవధి సోమవారం వరకు ఉన్నప్పటికీ.. వారిని శనివారమే న్యాయస్థానానికి తోడ్కొని వచ్చారు. బక్రీదు, తొలిఏకాదశి సెలవు ఉండడంతో ముందుగానే వారిని కోర్టులో హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. అంతకు మునుపు నిందితులకు వైద్య పరీక్షలను చేయించారు. ‘విచారణ సమయంలో పోలీసుల నుంచి ఏమైనా ఇబ్బంది ఎదురైందా’ అని న్యాయమూర్తి ప్రశ్నించగా, అటువంటిది ఏమీ లేదని నిందితులు స్పష్టం చేశారు. వారిని జూన్‌ 20 వరకు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టు నుంచి నేరుగా అన్నపూర్ణేశ్వరినగర ఠాణాకు తరలించారు. ఠాణాకు చేరుకున్న అనంతరం పవిత్రా గౌడను సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్‌కు చేర్చారు. హత్యకు మునుపు, అనంతరం నిందితుల వాట్సప్‌ చాట్ హిస్టరీ, కాల్‌ డేటాను రాబట్టే ప్రయత్నాలను ఫోరెన్సిక్‌ ప్రయోగశాల నిపుణులు కొనసాగించారు. దర్శన్‌ను న్యాయనిర్బంధానికి పంపించే అవకాశం కూడా ఉండడంతో పరప్పన అగ్రహార కారాగారం వద్ద పోలీసులు ముందస్తుగా భద్రతను ఏర్పాటు చేశారు.

రేణుకాస్వామి హత్య కేసులో ఇప్పటి వరకు లొంగిపోయిన ఐదుగురుతో కలిసి 16 మందిని అరెస్టు చేశామని డీసీపీ గిరీశ్‌ తెలిపారు. నటుడు దర్శన్, నటి పవిత్రాగౌడ, పవన్, ప్రదోశ్, నందీశ్, కేశవమూర్తి, రాఘవేంద్ర, ఎం లక్ష్మణ్, దీపక్‌ కుమార్, కార్తిక్, ఆర్‌ నాగరాజ్, వి.వినయ్, నిఖిల్‌ నాయక్, అనుకుమార్, రవి, జగదీశ్‌లను నిందితులుగా గుర్తించామన్నారు. హత్యలో పాల్గొన్న మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు తీవ్రం చేశామని చెప్పారు. రేణుకాస్వామిని చిత్రదుర్గలో అపహరించుకుని, బెంగళూరులోని పట్టణగెరెలోని షెడ్డులో ఉంచి చిత్రహింసలు పెట్టారని గుర్తించామని తెలిపారు. తాను శాకాహారిని అని చెప్పినా, బలవంతంగా బిర్యానీ, ఎముకను నోట్లో పెట్టి తినిపించారని వివరించారు. దాన్ని తినకుండా ఉమ్మేయడంతో మళ్లీ కొట్టారని చెప్పారు. ‘మాంసం తింటే శక్తి వస్తుంది.. బాస్‌ కొడితే తట్టుకోవచ్చు’ అంటూ గేలి చేశారని నిందితుల విచారణలో గుర్తించారు. అపహరించినప్పటి నుంచి బెంగళూరుకు తీసుకురావడం, షెడ్డులో దాడి చేయడానికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను ఇప్పటికే పోలీసులు స్వాధీనపరుచుకుని పరిశీలించారు. హత్య చేసేందుకు ముందుగా రేణుకాస్వామికి విద్యుత్తు షాకు కూడా ఇచ్చారని గిరీశ్‌ తెలిపారు. నిందితుల ఇళ్లలో మహజరు చేసి నగదు, అనుమానాస్పదంగా కనిపించిన వస్తువులను పోలీసులు ఇప్పటికే జప్తు చేసుకున్నారు.

కొనసాగుతున్న ఆందోళనలు

రేణుకాస్వామిని హత్య చేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని బెంగళూరు, మండ్య, చిత్రదుర్గ, దావణగెరె జిల్లాల్లో వివిధ పౌరసంఘాల ప్రతినిధులు తమ ఆందోళనలను కొనసాగించారు. హతుడు రేణుకాస్వామి కుటుంబ సభ్యులకు కర్ణాటక చలనచిత్ర వాణిజ్య మండలి ప్రతినిధులు రూ.5 లక్షల పరిహారాన్ని అందించారు. తన కుమారుడు అనుకుమార్‌ హంతకుల్లో ఒకడని తెలిసి గుండెపోటుతో మరణించిన అతని తండ్రి చంద్రప్ప (55) అంత్యక్రియలు చిత్రదుర్గలో శనివారం ముగిశాయి. అనుకుమార్‌ను పోలీసు భద్రత మధ్య అంత్యక్రియలకు తీసుకువెళ్లి, మళ్లీ తమతో తోడ్కొని వెళ్లారు.

పోలీసు వాహనం ఎక్కేందుకు ముందుగా పవిత్రా గౌడ.. వెనుక వస్తున్న దర్శన్‌

కైగాలో పూజలు..

దర్శన్‌ ఈ కేసు నుంచి బయట పడాలని కోరుకుంటూ కైగాలోని ఆలయాల్లో అతని బావ మంజునాథ్‌ శనివారం పూజలు చేశారు. దర్శన్‌ సోదరి దివ్య, ఆమె భర్త మంజునాథ్‌ ఇద్దరూ కైగా టౌన్‌షిప్‌లోని రామలింగేశ్వర, శనేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మంజునాథ్‌ కైగా విద్యుత్తు స్థావరంలో ఉద్యోగి.

నేను చంపలేదు..

పవిత్రా గౌడకు అశ్లీల చిత్రాలు పంపించడంతో కోపంతో తాను రేణుకాస్వామిపై చేయి చేసుకున్నానంటూ విచారణ చేస్తున్న పోలీసులకు దర్శన్‌ వివరించాడు. రెండు దెబ్బలు కొట్టి, షెడ్డు నుంచి బయటకు వచ్చానని, మిగిలిన వారు అతన్ని హత్య చేసి, తన తలకు చుట్టారని ఆక్రోశించాడు. ‘సార్, అతన్ని తీసుకువచ్చేంత వరకు నాకు ఈ విషయం తెలియదు. అతన్ని బెంగళూరుకు తీసుకువచ్చామని చెప్పి షెడ్డుకు తీసుకువెళ్లారు. అతనితో పవిత్రా గౌడకు క్షమాపణలు చెప్పిద్దామని మాత్రమే వెళ్లాను. నన్ను, పవిత్రను చూసిన వెంటనే తప్పయిందని.. చేతులు జోడించాడు. రెండు దెబ్బలు వేశాను. జేబులో నుంచి డబ్బులు తీసిచ్చి, భోజనం చేసి ఊరికి వెళ్లమని సూచించి, ఇంటికి వచ్చేశాను’ అని పోలీసులకు దర్శన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని