Viral Story: పితృత్వాన్ని ఆస్వాదించేందుకు.. వైస్‌ ప్రెసిడెంట్ హోదానే వదిలి..!

తన బిడ్డ కోసం ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని వదులుకున్నారు ఓ తండ్రి. ఇప్పుడు ఆయన స్టోరీ నెట్టింట్లో వైరల్‌గా మారింది. 

Published : 19 Nov 2022 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జీవితంలో ఎదిగే క్రమంలో చిన్నచిన్న సంతోషాలు వదులుకోకూడదంటారు. మరీ ముఖ్యంగా పిల్లలతో వీలైనంత ఎక్కువ సమయం గడపాలని చెప్తారు నిపుణులు. నాన్నతనాన్ని ఆస్వాదించేందుకు అలాంటి ఓ నిర్ణయమే తీసుకున్నారు అంకిత్ జోషి. ఐఐటీ ఖరగ్‌పుర్‌లో చదివిన ఆయన.. కుమార్తె కోసం వైస్‌ ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగాన్నే వదులుకున్నారు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

‘ఇదొక అసాధారణ నిర్ణయమని నాకు తెలుసు. వైస్ ప్రెసిడెంట్‌ హోదాలో కొత్త ఉద్యోగంలో కొద్ది నెలల క్రితమే చేరాను. విధుల్లో భాగంగా పలు నగరాలు తిరగాలి. కానీ, నా చిట్టిపాప భూమ్మీదకు వచ్చే కొద్ది రోజుల ముందు, తనను మురిపెంగా చూసుకోవాలని ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవడం సరికాదని నన్ను ఎంతోమంది వారించారు. కానీ నా భార్య ఆకాంక్ష నాకు మద్దతుగా నిలిచింది. 

నా కుమార్తె కోసం ఎక్కువ సమయం కేటాయించాలనుకున్నాను. అంతకాలం సెలవులు పొందడం కుదరదు. పితృత్వాన్ని ఆస్వాదించాలనే నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి పాపే నాకు లోకమైంది. తనను నా చేతుల్లో ఊపుతూ నిద్రపుచ్చడం, తన కోసం లాలి పాటలు పాడటం వంటి ఎన్నో మధురానుభూతులు ఇప్పుడు నా సొంతం. ఇప్పటికే పాప పుట్టి నెల రోజులు గడిచిపోయాయి. ఇంకా కొన్ని నెలల తర్వాతే కొత్త ఉద్యోగం గురించి ఆలోచిస్తాను. మరో విషయం.. మాతృత్వ సెలవుల్లో ఉన్నప్పటికీ నా భార్యకు ప్రమోషన్ వచ్చింది. తను ఇటు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ, అటు ఉద్యోగంలో రాణించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ఇన్నేళ్ల జీవితంలో ఈ నెల రోజులు అత్యంత సంతృప్తికరంగా గడిచాయి’ అని  తన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే పితృత్వ సెలవులు తక్కువగా ఉండటాన్ని ప్రస్తావించారు. 

అంకిత్ జోషి స్టోరీ ఎంతోమందిని మెప్పించింది. ‘మీ స్టోరీ వింటుంటే హాయిగా ఉంది. ఉద్యోగంలో ఒక అడుగు వెనక్కి వేసి, పాపకు సమయం వెచ్చించడం బాగుంది’, ‘పితృత్వాన్ని ఆస్వాదించేందుకు జాబ్ వదిలేశావా..? గ్రేట్ సోదరా’ అని నెటిజన్లు రాసుకొచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని