చాక్లెట్లతో మతిమరుపు మాయం..!

మతిమరుపు అనేది మానవ సహజం. ఇది కాస్త అయితే ఫర్వాలేదు గానీ.. మరీ అధికమైతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వయసు మీదపడిన వారిలో మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని అధిగమించేందుకు చాక్లెట్లు తినాలంటున్నారు...........

Published : 09 Dec 2020 00:03 IST

తాజా అధ్యయనంలో వెల్లడి

ఇంటర్నెట్‌ డెస్క్‌: మతిమరుపు మానవ సహజం. ఇది కాస్త మోతాదులో ఉంటే ఫర్వాలేదు గానీ.. మరీ అధికమైతే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. ముఖ్యంగా వయసు మీదపడిన వారిలో మతిమరుపు ఎక్కువగా ఉంటుంది. అయితే దీన్ని అధిగమించేందుకు చాక్లెట్లు తినాలంటున్నారు బర్మింగ్‌హామ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. వయసు పెరిగేకొద్ది మతిమరుపు పెరుగుతుందనీ, దానికి విరుగుడుగా చాక్లెట్లు తినాలంటూ సూచిస్తున్నారు. వారి నివేదిక ప్రకారం.. చాలామందిలో చాక్లెట్లు తింటే దంతాలు పాడైపోతాయనే అపోహ ఉంది. కానీ, చాక్లెట్ నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.  ముఖ్యంగా డార్క్‌ చాక్లెట్లలో ఉండే పాలీ ఫెనాల్స్‌ చర్మానికి, గుండెలోని కణాలకు హాని చేసే రసాయనాలను నివారిస్తాయి. వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వ్యాధిని సైతం అడ్డుకుంటాయి. మిగిలిన తీపి పదార్థాలతో పోలిస్తే చాక్లెట్లు తినడం మంచిదేనని తాజా పరిశోధనల్లో తేలింది.

చాక్లెట్‌లో ఉపయోగించే కోకోలోని పోషకాల్లో ఫ్లేవనోల్ ఉంటుంది. ఇవి మతిమరుపును దూరం చేస్తుందని బర్మింగ్‌హమ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకురాలు కాటరీనా రెండెరో, ప్రొఫెసర్లు మెనికా ఫాబియాని, గాబ్రియేల్‌ గ్రాటన్‌ తెలిపారు. అలాగే 18 మందిపై జరిపిన అధ్యయనంలో 14 మందికి రోజూ చాక్లెట్‌ తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడినట్లు గుర్తించారు. అయితే.. ఎక్కువ కోకో క్యాలరీలు ఉన్న చాక్లెట్లకు మాత్రం దూరంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కూరగాయలు, పండ్లలో కూడా కోకో ఫ్లేవనోల్స్‌ తక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపారు. అయితే అవి మెదడు పనితీరుపై అంతగా ప్రభావం చూపవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని