Published : 26 Jun 2022 18:34 IST

Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్‌.. వరుడు క్లీన్‌ షేవ్‌ చేసుకోవాల్సిందే..

జైపూర్‌: ఈరోజుల్లో పెళ్లంటేనే భారీ డెకరేషన్లు, డీజే సౌండ్లు, ముస్తాబులు, ఇతరత్రా ఆర్భాటాలు.. కాలం మారుతున్నా కొద్దీ వివాహాల సంస్కృతి మారుతూ వస్తోంది. దీంతో కొందరు తమ తాహతుకు మించి ఖర్చు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఫలితంగా వారు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌ పాలిలోని రెండు సామాజికవర్గాలు ఈ హంగూఆర్భాటాలకు స్వస్తి పలకాలని నిశ్చయించుకున్నాయి. వివాహాలను చాలా తక్కువ ఖర్చుతో చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి.

భారీగా అలంకరణ, డీజే చప్పుళ్లు, బాణాసంచా లేకుండా.. గుర్రంపై వరుడి ఊరేగింపు లేకుండా వివాహాలు జరుపుకోవాలని కుమావత్, జాట్ సామాజిక వర్గాల నేతలు నిర్ణయించాయి. వధూవరులకు ఇచ్చే నగలు, నగదు, దుస్తుల లాంటి బహుమతులపై కూడా పరిమితులు విధించేందుకు సిద్ధమయ్యాయి. వరుడితోపాటు, వివాహానికి హాజరయ్యే వారికి గడ్డం ఉండకూడదని స్పష్టం చేశారు. వివాహ వేడుకను దైవ కార్యంగా, వరుడ్ని రాజుగా భావించే పెళ్లిలో వరుడికి గడ్డం ఉండకూడదని, పెళ్లికి వచ్చేవారు కూడా గడ్డాలతో రాకూడదని కుమావత్‌ వర్గం నేత లక్ష్మీ నారాయణ్‌ తిలక్‌ వెల్లడించారు. అలంకారాలు, మ్యూజిక్‌, ఇతర పనులకు డబ్బును వృథా చేయడం అనవసరం అని పేర్కొన్నారు.

అదేవిధంగా, పాలిలోని రోహెత్ సబ్‌డివిజన్‌లోని ఐదు గ్రామాలకు చెందిన జాట్ కమ్యూనిటీ నేతలు కూడా వివాహ కార్యక్రమాలను భారీగా చేయకూడదని నిబంధనలను రూపొందించుకున్నారు. వివాహ ఊరేగింపులను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ‘సమాజంలోని అన్ని కుటుంబాల వివాహాల్లో ఏకరూపత కోసం కొన్ని సంస్కరణలు తీసుకురావాలని నిర్ణయించుకున్నాం’ అని భకరివాలా గ్రామ సర్పంచి అమ్నారం బెనివాల్ తెలిపారు. ‘డబ్బు ఉన్నవాళ్లు వివాహాలను ఆర్భాటంగా చేస్తున్నారు. ఇవి మధ్యతరగతి, పేదవారిపై ప్రభావం చూపుతున్నాయి. వారు కూడా ఈ తరహాలో చేయాలని అప్పులపాలవుతున్నారు. సమాజంలో సమానత్వం, వివాహ కార్యక్రమాలలో ఏకరూపత తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నియమాలను తీసుకొచ్చాం’ అని సర్పంచి వెల్లడించారు. ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని