Published : 27 Feb 2022 02:06 IST

Telangana News: జలవనరుల సంరక్షణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ: నిరంజన్‌రెడ్డి

హైదరాబాద్‌: జలవనరుల సంరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. నదుల పరిరక్షణ, మేనిఫెస్టో తయారీ ప్రధాన అజెండాగా హైదరాబాద్‌లో ప్రారంభమైన జాతీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సుకు 27 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా నదుల పరిస్థితులపై చర్చించడంతో పాటు సవాళ్లు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో నదులు, జలసంరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలపైనా చర్చ జరుగుతుంది.

నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఏడేళ్లలో వేగంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణతో జలవనరులను సంరక్షించాం. తెరాస ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల కృష్ణా, గోదావరి నదుల్లోకి వ్యర్థాలు వెళ్లడం లేదు. ఈ విధానాలను ఆదర్శంగా తీసుకొని అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోంది. భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా నీటి కోసమే పోరాటాలు జరిగే ప్రమాదముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నదులను పరిరక్షించే బాధ్యతను తీసుకుంది. రికార్డు సమయంలో పూర్తి చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి నది 200 కిలోమీటర్ల మేర సజీవంగా ఉంది. నదుల్లోకి వ్యర్థాలు వెళ్లకుండా, భూమి కోతకు గురి కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏడేళ్ల కాలంలో 3 శాతం పచ్చదనం పెరిగింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కావడంతో వలస వెళ్లిన ప్రజలతో పాటు పక్షులు కూడా పాలమూరుకు తిరిగివస్తున్నాయి. ఎంత పంట పండినా దాన్ని అవసరం ఉన్న చోట వినియోగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు దేశానికి దిక్సూచి కావాలి. ఈ తరహా కార్యక్రమాలను ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేయాలి’’ అని పేర్కొన్నారు.

భవిష్యత్ తరాలకు ఏం చెబుతాం?: వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా

‘‘చదువుకున్న వారు అధికంగా ఉన్న దిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల్లోనే నదులు కలుషితం అవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ మూసీ పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. నదులు నాలాలుగా మారితే భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతాం? నదుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు అనేక  తీర్పులు ఇచ్చినా అవి అమలు కావడం లేదు. రెండు రోజుల సదస్సులో రివర్ మేనిఫెస్టో పేరిట నదుల ఘోషణా పత్రాన్ని రూపొందిస్తాం’’ అని తెలిపారు.


Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts