Published : 18 Sep 2020 22:53 IST

భారత్‌.. పాక్‌ ప్రభుత్వాలకు ‘శాంతి’ బహుమతి!

ప్రకటించిన ఇంప్రాబబుల్‌ సంస్థ

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతదేశం.. పాకిస్థాన్‌ మధ్య బంధానికి ప్రతీకగా ఇరు దేశాల ప్రభుత్వాలకు ‘శాంతి’ బహుమతి లభించింది. ఈ వ్యాఖ్య చూస్తేనే వ్యంగ్యంగా ఉంది కదా..! నిజమేనండీ భారత్‌.. పాక్‌ ప్రభుత్వాలకు శాంతి పురస్కారం దక్కింది. అయితే ఇది నోబెల్‌ వారి శాంతి బహుమతి కాదు.. ఇగ్నోబెల్‌ పురస్కారం.

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా నోబెల్‌ బహుమతి అందజేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ నోబెల్‌ బహుమతికి వ్యంగ్యంగా ఇంప్రాబబుల్‌ రీసెర్చ్‌ అనే సంస్థ ‘ఇగ్నోబెల్’‌ పేరుతో 1991 నుంచి పురస్కారాలు ఇవ్వడం ప్రారంభించింది. పలు రంగాల్లో విచిత్రమైన, హాస్యాస్పదమైన ఆవిష్కరణలు చేసిన వారికి, సిద్ధాంతాలను ప్రతిపాదించిన వారికి ఈ అవార్డు అందిస్తుంటారు. తాజాగా సెప్టెంబర్‌ 17న 30వ ఇగ్నోబెల్‌ పురస్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏటా అమెరికాలో ఓ సభ ఏర్పాటు చేసి విజేతలకు నేరుగా పురస్కార ప్రదానం చేసేవారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఆన్‌లైన్‌లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అవార్డులు ప్రకటించారు. ఈ అవార్డుల్లో ‘శాంతి బహుమతి’ విభాగానికి భారత్‌.. పాక్‌ ప్రభుత్వాలు ఎంపికయ్యాయి. ఈ అవార్డు ఇవ్వడానికి కారణం ఇరు దేశాల దౌత్యాధికారులపై జరిగిన వేధింపులు, వాటిపై ఇరు దేశాల వాదనలేనని నిర్వాహకులు తెలిపారు.

రెండేళ్ల కిందట పాకిస్థాన్‌లోని భారత దౌత్యాధికారులు, భారత్‌లోని పాకిస్థాన్‌ దౌత్యాధికారులు వేధింపులకు గురైన సంఘటన ఆధారంగా ఈ బహుమతిని ప్రకటించారు. అప్పట్లో కొందరు ఇరు దేశాల్లోని అధికారుల కార్లకు తోకలు అంటించడం, అర్ధరాత్రుళ్లో వారి ఇంటి డోర్‌బెల్‌ కొట్టి పారిపోవడం వంటి చర్యలకు పాల్పడ్డారట. దీంతో తమ అధికారులను వేధిస్తున్నారంటూ ఇరు దేశాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ ఘటనలపై పత్రికలు ప్రచురించిన కథనాల ఆధారంగా భారత్‌.. పాక్‌కు ఈ అవార్డు అందిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. సాధారణంగా నోబెల్‌ శాంతి బహుమతిని శాంతి కోసం కృషి చేసే వారికి ఇస్తుంటారు. కానీ ఇగ్నోబెల్‌ బహుమతిని ఒకరునొకరు కవ్వింపులకు పాల్పడుతూ అశాంతి నెలకొల్పే సందర్భాలకు ప్రకటిస్తుంటారు. 

ఇగ్నోబెల్‌ పురస్కారాల్లో భౌతిక శాస్త్రం విభాగంలో వానపాము గుండా అత్యధిక పౌనఃపుణ్యంతో ప్రకంపనలు పంపినప్పుడు వానపాము ఆకృతి ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు చేసిన పరిశోధనకు గానూ శాస్త్రవేత్తలు ఇవాన్‌ మాక్సీమువ్‌, అండ్రీ పొటోస్కీకి ఈ బహుమతి లభించింది. ఇదే కాకుండా అకౌస్టిక్‌, ఫిజియాలజీ, ఎకనామిక్స్‌, మెనేజ్‌మెంట్‌, ఎంటోమోలాజీ, మెడిసన్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌, మెటీరియల్‌ సైన్స్‌ విభాగాల్లోనూ వింతైన ఆవిష్కరణలు చేసిన వారిని ఈ ఇగ్నోబెల్‌ అవార్డులను అందించారు. 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని