Ukraine Crisis: కాపాడండి ప్లీజ్‌.. ఉక్రెయిన్‌లో తెలుగు విద్యార్థుల ఆవేదన

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తమను సురక్షితంగా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో...న

Updated : 24 Feb 2022 19:13 IST

సొలొమ్‌ యాన్స్‌ కీ: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు అక్కడ బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. తమను సురక్షితంగా భారత్‌కు రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఉక్రెయిన్‌లోని సొలొమ్‌ యాన్స్‌ కీ నగరంలో కొందరు తెలుగు విద్యార్థులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. మెడిసిన్‌ చదువుతన్న వైద్య విద్యార్థులు భవానీ, సాయి, నికిత.. వారు పడుతున్న ఇబ్బందులను ఈనాడు-ఈటీవీకి వివరించారు.

‘‘నేను కీవ్‌లో ఎంబీబీఎస్‌ మూడో సంవత్సరం చదువుతున్నా. ఇక్కడ పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉంది. ఉదయం నుంచి బాంబుల శబ్దాలు, అంబులెన్స్‌ శబ్దాలు వినబడుతున్నాయి. భయంగా ఉంది. సరకుల కోసం బయటకు వెళ్లాలన్నా చాలా భయం వేస్తోంది. భారత్‌ నుంచి చాలా కాల్స్‌ వస్తున్నాయి. ఇక్కడి ఎంబసీ వారు మాత్రం ఇంకా సమాచారం ఇవ్వలేదు. బయటకు వెళ్లలేకపోతున్నాం. ఇక్కడ ఏటీఎంలలో డబ్బులు రావడం లేదు. పవర్‌ కట్ ఉంది. దీంతో నెట్‌ రావడంలేదు. ఇక్కడ మేం ఓ ప్లాట్‌లో ఐదుగురం ఉన్నాం. వేరేచోట ఫ్రెండ్స్‌ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావడంలేదు.

ఉక్రెయిన్‌కు దేశానికి చెందిన వారు వారి సొంత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. మా తల్లిదండ్రులు భారత్‌ నుంచి ఫోన్‌ చేసి మాట్లాడుతున్నారు. ధైర్యంగా ఉండాలని.. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలని చెబుతున్నారు. ఇక్కడ ఐదుగురం ఉన్నాం. యూనివర్సిటీ నుంచి మాకు ఎలాంటి సమాచారం రావడం లేదు. మా భద్రత విషయంలో ఎవరి నుంచి ఎలాంటి సహాయం అందుడం లేదు. విమానాలు రద్దు చేయడంతో ఎటూ వెళ్లలేని స్థితిలో భయపడుతూ గడుపుతున్నాం. ఎంబసీ నుంచి కూడా ఎలాంటి సమాచారం రావడం లేదు. మమ్మల్ని ఇక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. నా స్నేహితులు దాదాపు 40 మంది వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు’’ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని