Odisha:గీతలు దాటి..చీరకట్టులో దూసుకెళ్తూ..

బుల్లెట్, ట్రాక్టర్, బస్సు, ట్రక్కు..ఇలా దేన్నైనా సరే ఆమె పరుగులు పెట్టిస్తుంది. గుర్రంపై సవారీ చేస్తుంది.

Published : 08 Jun 2021 01:30 IST

భువనేశ్వర్: బుల్లెట్, ట్రాక్టర్, బస్సు, ట్రక్కు..ఇలా దేన్నైనా సరే ఆమె పరుగులు పెట్టిస్తుంది. గుర్రంపై సవారీ చేస్తుంది. ఏ జంకూగొంకూ లేకుండా వీటిని నడపడం ఒక ఎత్తైతే.. భారతీయతకు ప్రతిబింబమైన చీరలో దూసుకెళ్లడం మరొక ఎత్తు. ఇంటికే పరిమితమైన ఓ ఇల్లాలు భర్త అండతో గీతలు చెరిపేసుకుంటూ ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఇటీవల ఆమె గుర్రంపై సవారీ చేసిన వీడియో యూట్యూబ్‌లో షేర్ చేయగా..ఇప్పుడది వైరల్‌గా మారింది. 

ఒడిశాలోని జాహల్ గ్రామానికి చెందిన మోనాలిసా..సంప్రదాయ చీరకట్టులో నిండుగా కనిపిస్తారు. కానీ ఆమె పొలంలో దుక్కి దున్నుతారు. బుల్లెట్‌పై రయ్‌మని దూసుకెళ్తారు. గుర్రంపై సవారీ చేస్తారు. 2016లో యూట్యూబ్ చానల్ ప్రారంభించిన ఆమె..అప్పటినుంచి తనకి తెలిసిన విద్యనంతా దాంట్లో పోస్టు చేస్తున్నారు. వాటిలోని కొత్తదనం మోనాలిసాను అనుసరించే వారి సంఖ్యను సుమారు 2.26మిలియన్లకు చేర్చింది. అయితే ఈ క్రెడిట్‌ అంతా తన భర్త బద్రి నారాయణ్ భద్రాకే దక్కుతుందంటారు మోనాలిసా. ఆయన ఒక క్రియేటివ్ డైరెక్టర్‌. అలాగే సామాజిక కార్యకర్త కూడా. తన భర్తే తనకు యూట్యూబ్ చానల్‌ను పరిచయం చేశారని..ఇప్పుడది తనకు ఆదాయాన్ని సమకూర్చుతుందని ఆమె చెప్పారు. ఇవే కాకుండా మోనాలిసా జంతు ప్రేమికురాలు కూడా. ఆమె ఇల్లు ఒక జూని పోలి ఉంటుందని స్థానికులు చెప్తారు. కట్టుబాట్లను దాటుకొని, మొహమాటానికి తావివ్వకుండా ముందుకెళ్తున్న మోనాలిసా..యువతకు ఆదర్శమే కదా..! 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని