Harish rao: మూడంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్.. కమిటీ ఏర్పాటు: హరీశ్‌రావు

ఆస్పత్రుల్లో మూడంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని..

Updated : 23 Sep 2022 13:29 IST

హైదరాబాద్‌: ఆస్పత్రుల్లో మూడంచెల విధానంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్‌ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హారీశ్‌రావు తెలిపారు. ప్రతి ఆసుపత్రిలో సూపరింటెండెంట్‌ ఆధ్వర్యంలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఆ కమిటీ రివ్యూ చేసి వివరాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఆపరేషన్ల థియేటర్ల వారీగా ఇన్ఫెక్షన్ కంట్రోల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్‌లను నియమించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్‌ ప్రివెన్షన్‌ ట్రైనింగ్‌ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ కంట్రోల్ చాలా బాగుందన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ 7 శాతం ఉంటే.. అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో 10శాతంగా ఉందని వెల్లడించారు.

‘‘ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని టీచింగ్ ఆస్పత్రుల ప్రతినిధులకు నిమ్స్‌లో 2 రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం టీవీవీపీ, ప్రైమరీ హెల్త్ కేంద్రాల ప్రతినిధులకు ట్రైనింగ్ ఉంటుంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఇన్ఫెక్షన్ కంట్రోల్ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, డయాలసిస్ ప్రాంతాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. టీచింగ్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మెరుగయ్యాయి. ఆపరేషన్‌ థియేటర్లలో అవసరమైన అన్ని పరికరాలు కొనుగోలు చేయాలని ఆస్పత్రుల సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు జారీ చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమైన ఆస్పత్రుల్లో రూ.30 కోట్లతో మార్చురీల ఆధునికీకరణ చేపట్టాం. 56 హై ఎండ్ అల్ట్రా సౌండ్ మిషన్‌లు అందుబాటులోకి రానున్నాయి. గర్భిణులు ఒక్క స్కాన్ కోసం కూడా బయటకు వెళ్లాల్సిన పని ఉండదు. పీహెచ్‌సీల కోసం వచ్చే 10 రోజుల్లో వెయ్యి మంది వైద్యులను పూర్తి స్థాయిలో నియమించేందుకు చర్యలు తీసుకుంటాం. రానున్న 2 రోజుల్లో 1,140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తాం’’ అని హరీశ్‌రావు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని