ముక్కు ద్వారా ఇచ్చే టీకాతో కొవిడ్‌కు చెక్‌!

వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌లపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated : 04 Mar 2021 04:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మానవాళిని సంక్షోభంలోకి నెట్టిన కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌లు ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి వచ్చాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో ఇవి సమర్థవంతంగానే పనిచేస్తున్నట్లు తేలింది. అయితే, ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ ఇంజెక్షన్‌ ద్వారానే నేరుగా శరీరంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్‌ శరీరంలోకి వెళ్లిన తర్వాత రోగనిరోధక శక్తిని పెంచే టీ కణాలను ఉత్పత్తి చేస్తాయి. వైరస్‌ సోకినప్పుడు ఈ కణాలు వాటిపై పోరాడి రక్షణ కల్పిస్తాయి. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇలా వచ్చిన రోగనిరోధకత మ్యుటేషన్‌ చెందిన కొత్తరకం వల్ల క్షీణిస్తుందనే వార్తలు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు ముక్కు ద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌లపై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

శరీరంలోకి ప్రవేశించిన కరోనా వైరస్‌ ఊపిరితిత్తులకు చేరి తీవ్ర ప్రభావం చూపిస్తుందన్న విషయం తెలిసిందే. కొంతకాలం తర్వాత అక్కడ తీవ్రత తగ్గినప్పటికీ, ముక్కు, గొంతు వంటి తేమ ప్రదేశాల్లో కరోనా వైరస్‌ కొంతకాలం పాటు దాగిఉండే అవకాశం ఉందని జంతువుల్లో జరిపిన పరిశోధనల్లో తేలింది. అందుకే వ్యాక్సిన్‌ తీసుకున్నప్పటికీ ముక్కు, గొంతులో ఉన్న వైరస్‌ ఇతరులకు వ్యాపించే ఆస్కారం ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముక్కు ద్వారా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లయితే వైరస్‌ను సమర్థవంతంగా నాశనం చేయవచ్చని అంటున్నారు. స్టెరిలైజింగ్‌ రోగనిరోధక శక్తిగా పిలిచే ఈ నిరోధకాల వల్ల వైరస్‌ ఇతరులకు వ్యాప్తి చెందకుండా సమర్థవంతంగా అడ్డుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

1955లో ఇంజెక్షన్‌ రూపంలో వచ్చిన పోలియో వ్యాక్సిన్‌ను ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ ఇస్తోన్న విధానంలో అందించినట్లు పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. అయితే, వైరస్‌ ప్రభావాన్ని అది తగ్గించినప్పటికీ, అన్ని సమయాల్లో ఇన్‌ఫెక్షన్‌ను నిర్మూలించడంలో సరైన పనితీరు కనబరచలేదు. దీనితర్వాత 1960వ దశకంలో వచ్చిన నోటి ద్వారా తీసుకునే పోలియో వ్యాక్సిన్‌ ఇదివరకటి వాటికంటే సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. అంతేకాకుండా ఇన్‌ఫ్లూయెంజాకు వాడే వ్యాక్సిన్‌లు ఇంజెక్షన్‌ రూపంలో ఉన్నప్పటికీ, తదనంతరం ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో కరోనా వైరస్‌కూ ముక్కుద్వారా ఇచ్చే వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నాలుగు దేశాల్లో (చైనా, భారత్‌, బ్రిటన్‌, అమెరికా) వీటి తొలి దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

ఎలాంటి నొప్పి లేకపోవడం, ప్రత్యేకంగా సిరంజీలు అవసరం లేకపోవడం, ఎవరి సహాయం లేకుండానే సొంతంగానే తీసుకునే సౌలభ్యం ఉండటం ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌ వల్ల ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. వీటితో పాటు రిఫ్రిజిరేటర్లు అవసరం లేకపోవడం, తేలికగా రవాణా చేసుకునే సౌలభ్యం ఉన్నందున ముక్కు ద్వారా తీసుకునే వ్యాక్సిన్‌లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని