బర్డ్‌ ఫ్లూ: గుడ్డు..మాంసం తినొచ్చా?

కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయన్న వార్తలతో ప్రజలు ఇప్పుడిప్పుడే ‘ హమ్మయ్య’ అనుకుంటున్న తరుణంలో బర్డ్‌ఫ్లూ వైరస్‌ రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌,..

Published : 09 Jan 2021 00:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా మహమ్మారితో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తాయన్న వార్తలతో ప్రజలు ఇప్పుడిప్పుడే ‘హమ్మయ్య’ అనుకుంటున్న తరుణంలో బర్డ్‌ఫ్లూ రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వేలాది పక్షులు మృత్యువాత పడ్డాయి. ఆయా చోట్ల లక్షలాది కోళ్లను యజమానులు పూడ్చిపెడుతున్నారు. నిన్నటికి నిన్న గుంటూరు జిల్లాలోనూ కాకులు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమై నమూనాలను పరిశీలనకు పంపించారు. ఈ నేపథ్యంలో గుడ్డు, మాంసం తినడం శ్రేయస్కరమేనా?అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (బర్డ్‌ఫ్లూ) వ్యాప్తి నేపథ్యంలో గుడ్డు, మాంసం తినడంపై ఎన్నో అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి. కొందరు వాటి ద్వారా వైరస్‌ వ్యాపిస్తుందంటే, మరికొందరు కొట్టిపారేస్తున్నారు. పక్షుల ద్వారా మనుషులకూ వైరస్‌ సోకుతుందని కొందరు చెబుతున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) కొన్ని వివరాలు వెల్లడించింది. బర్డ్‌ఫ్లూ వైరస్‌ సోకిన పక్షులను దగ్గరికి తీసుకోవడం, వాటి మాంసాన్ని సరిగా ఉడికించకుండా తినడం వల్ల వైరస్‌ మనుషులకు వ్యాపించే అవకాశముందని చెప్పింది. బాగా ఉడికించిన గుడ్లు, మాంసం తినడం వల్ల ఎలాంటి నష్టం లేదని పేర్కొంది.అధిక ఉష్ణోగ్రతలను బర్డ్‌ఫ్లూ వైరస్ తట్టుకోలేదని, అందువల్ల ఆహారాన్ని కనీసం 70 డిగ్రీల వరకు ఉడికిస్తే వైరస్‌ చనిపోతుందని చెప్పింది. వీలైనంత వరకు సగం ఉడికించిన (Half Boiled) ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించింది.

మరోవైపు కేంద్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఇటీవల బర్డ్‌ఫ్లూ వ్యాప్తిపై మాట్లాడుతూ.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితులన్నీ అదుపులోనే ఉన్నాయని చెప్పారు. విదేశీ పక్షులు, అటవీ పక్షుల వల్లే ప్రధానంగా వైరస్‌ వ్యాప్తి చెందుతోందని, ఇందులో భయపడాల్సిన పనేమీ లేదని అన్నారు. గుడ్లు, మాంసాన్ని పూర్తిగా ఉడికించి తింటే ఎలాంటి ఆపద వాటిల్లబోదని స్పష్టం చేశారు. అంతేకాకుండా వైరస్‌ వ్యాప్తిని నివారించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రప్రభుత్వాలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామన్నారు.

యూరప్ దేశాల్లోనే ఎక్కువ:
బర్డ్‌ఫ్లూ వైరస్‌ ప్రభావం యూరప్‌ దేశాల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా నెదర్లాండ్స్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, బెల్జియం, యునైటెడ్‌ కింగ్‌డమ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, పోలండ్‌, క్రొయేషియా, ఉక్రెయిన్‌లలో బర్డ్‌ఫ్లూను కనుగొన్నామని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ ప్రివెన్షన్‌ అండ్‌ కంట్రోల్‌ (ఈసీడీసీ) వెల్లడించింది. ఫ్రాన్స్‌లో సుమారు ఆరు లక్షలకు పైగా కోళ్లను వధించారు. జర్మనీలో 62వేల టర్కీ కోళ్లు, బాతులను వధించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి

‘చైనా టీకా అత్యంత ప్రమాదకరం’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని