Mallareddy: మల్లారెడ్డి సంస్థల్లో రూ.15 కోట్లు స్వాధీనం.. ఐటీశాఖ గుర్తించిన అక్రమాలివే!

రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరిగిన ఆదాయపన్నుశాఖ సోదాల్లో దాదాపు రూ.15కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 22వ తేదీ ఉదయం మొదలైన ఐటీ సోదాలు ఇవాళ మధ్యాహ్నం ముగిశాయి.

Updated : 24 Nov 2022 20:12 IST

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై జరిగిన ఆదాయ పన్నుశాఖ సోదాల్లో దాదాపు రూ.15కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ వర్గాలు వెల్లడించాయి. 22వ తేదీ ఉదయం మొదలైన ఐటీ సోదాలు ఇవాళ మధ్యాహ్నం ముగిశాయి. రెండున్నర రోజులపాటు కొనసాగిన సోదాల్లో మల్లారెడ్డి వ్యాపార లావాదేవీల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నట్టు గుర్తించామని ఐటీ వర్గాలు తెలిపాయి.

మెడికల్‌ కళాశాలల్లో ఎంబీబీఎస్‌, పీజీ సీట్ల విషయంలో విద్యార్థుల నుంచి దాదాపు రూ.135 కోట్లు డొనేషన్ల కింద వసూలు చేసినట్టు ఐటీశాఖ తెలిపింది. ఐటీ వర్గాలు వెల్లడించిన ప్రాథమిక సమాచారం మేరకు మెడికల్‌, డెంటల్‌, ఫార్మసీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు, ఆసుపత్రులు, స్థిరాస్తి వ్యాపారం తదితర ఆస్తులపై మల్లారెడ్డి సంస్థలకు చెందిన కార్యాలయాలు, సీఈవోలు, డైరెక్టర్లు, మల్లారెడ్డి కుమారులు, అల్లుడు, బంధువులు, స్నేహితుల ఇళ్లతో పాటు క్రాంతి బ్యాంకు ఛైర్మన్‌ ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు. సొసైటీ కింద నడుస్తున్న మల్లారెడ్డి విద్యాసంస్థల్లో నిబంధనలు తుంగలో తొక్కి కార్యకలాపాలు నిర్వహించినట్టు ప్రాథమికంగా గుర్తించారు. మల్లారెడ్డికి చెందిన అన్ని కళాశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేసినట్టు ఆధారాలు లభించాయని ఐటీశాఖ వెల్లడించింది. 400 మందికి పైగా ఐటీ సిబ్బంది 65 బృందాలుగా ఏర్పడి.. మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ సోదాలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున  అధికారులను ఐటీ శాఖ రప్పించింది. మరోవైపు సోదాలు ముగియడంతో ఈనెల 28, 29 తేదీల్లో హాజరై వివరణ ఇవ్వాలని మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులకు ఐటీశాఖ సమన్లు జారీ చేసింది. పెద్ద సంఖ్యలో సమన్లు ఇవ్వాల్సి ఉండటంతో మరికొందరికి వేరే తేదీల్లో హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.

నా కుమారుల ఇళ్లలో రూ.28లక్షలు మాత్రమే దొరికాయి...

పలు డాక్యుమెంట్లతో పాటు స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు, హార్డ్ డిస్క్ లు బషీర్‌బాగ్‌లోని ఐటీ కార్యాలయానికి తరలించారు. గత రాత్రి ఐటీశాఖ, ఇటు మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ఫిర్యాదులు చర్చనీయాంశమయ్యాయి. సోదాల అనంతరం మీడియాతో మాట్లాడిన మల్లారెడ్డి... తనపై కుట్ర పూరితంగా ఐటీ సోదాలు చేసిందని ఆరోపించారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, ఉద్యోగులు అందరినీ ఇబ్బంది పెట్టారన్నారు. తాను చాలా క్లియర్‌గా ఉన్నానని, కట్టిన పన్నులు, లావాదేవీలు అన్నీ ఆన్‌లైన్‌లో ఉంటాయన్నారు. రూ.100కోట్లు అవకతవకలు అనేది అవాస్తవమని కొట్టిపారేశారు. తన ఇంటితో పాటు కుమారుల ఇళ్లలో జరిపిన సోదాల్లో  కేవలం రూ.28 లక్షలు మాత్రమే దొరికాయన్నారు. వాటికి కూడా లెక్కలు ఉన్నాయని తెలిపారు. తామోదో దొంగల్లాగా సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు నిలువరించారన్నారు. వచ్చిన ఐటీ శాఖ అధికారులకు పూర్తిగా సహకరించామన్నారు.

బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు: మల్లారెడ్డి

స్వాధీనం చేసుకున్న సొత్తుకు సంబంధించి తన వద్ద, చిన్న కుమారుడు వద్ద సంతకం తీసుకున్నారని.. పెద్ద కుమారుడు మహేందర్ రెడ్డి అనారోగ్యంతో ఉండటంతో కళాశాలకు సెక్రెటరీగా ఉన్న చిన్న కుమారుడి వద్ద సంతకం తీసుకోవాలని ఐటీ అధికారికి చెప్పానని మల్లారెడ్డి తెలిపారు. సరే అని ఆస్పత్రికి వెళ్లే లోపు మహేందర్ రెడ్డి వద్ద సంతకం తీసుకుని వెళ్లిపోయి మోసం చేశారన్నారు. అందులో రూ.100కోట్లు డొనేషన్ తీసుకున్నారని రాసి వాటిపై బలవంతంగా సంతకం తీసుకున్నారని, అందుకే తన కుమారుడు భద్రారెడ్డి బోయిన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడని తెలిపారు. సంతకం తీసుకున్నానని తనపై దుర్భాషలాడి, ల్యాప్ టాప్, సెల్‌ఫోన్‌  తీసుకుని విధులకు ఆటంకం కలిగించాడని ఐటీశాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఘటన జరిగిన మల్లారెడ్డి మెడికల్ కాలేజి దుండిగల్ పరిధిలో ఉండటంతో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దుండిగల్‌కు బోయిన్ పల్లి పోలీసులు బదిలీ చేశారు. ఐటీ అధికారి మంత్రి మల్లారెడ్డిపై ఇచ్చిన ఫిర్యాదుతో  సెక్షన్ 342, 353, 201, 203, 504, 506, 379, రెడ్‌విత్‌ 34 IPC కింద కేసు నమోదు చేయగా..  భద్రారెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఐటీ అధికారి రత్నాకర్‌పై బలవంతంగా సంతకం తీసుకున్నారన్న ఫిర్యాదుతో 384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. డీడీఐటీ రత్నాకర్‌ను మంత్రి మల్లారెడ్డి ఇబ్బంది పెట్టడంపై ఐటీశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని