మగువతో మాట కలిపితే... ఒత్తిడి మాయం!

అంతే కాదు ఒత్తిడిని దూరం చేసేందుకు ఆయుధంగానూ ఉపయోగపడుతుంది

Updated : 02 Jul 2021 19:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమ్యూనికేషన్‌..  ఇది కేవలం మన భావాలను ఇతరులతో పంచుకునేందుకే కాదు.. ఎన్నో అపార్థాలనూ దూరం చేయగలదు.  అంతేనా.. మీకు మీరేంటో అర్థమయ్యేలా తెలియజేస్తుంది. అందుకే మరి మన స్నేహితులతో కాసేపు కబుర్లు చెప్పుకున్నా ఎంతో ఉత్సాహం వస్తుంది. ఊరటా లభిస్తుంది. ఒత్తిడిని దూరం చేసేందుకు ఆయుధంగానూ ఉపయోగపడుతుంది. తాజాగా బెక్‌మేన్‌ ఇనిస్టిట్యూట్‌ అధ్యయనాల్లో ఒత్తిడిని  అధిగమించడంపై ఓ ఆసక్తికర విషయం వెల్లడైంది. అదేంటంటే.. అమ్మాయిలు ఎవరైతే తమ విషయాలను తమ స్నేహితురాలితో చర్చిస్తారో.. వారిలో ఒత్తిడి శాతం చాలా తక్కువ ఉంటోందట. అంతేకాదు.. మనసుకి ఉపశమనమూ లభిస్తుందని తేలింది.

ఈ పరిశోధనా సారాంశాన్ని ‘‘జర్నల్‌ ఆఫ్‌ వుమెన్‌ అండ్‌ ఏజింగ్‌’’లో ప్రచురించారు. మన శరీరంలో ఒత్తిడికి గురైనప్పుడు  ‘కార్టిసాల్‌’ అనే హార్మోన్‌ విడుదల అవుతుంది. యువతులు, పెద్దవయస్సున్న స్త్రీలు.. తమ సమస్యని పరిష్కరించుకునే మార్గాల్లో భాగంగా.. ఇతర స్నేహితులతో చర్చిస్తే కార్టిసాల్‌ హార్మోన్‌ శరీరంలో తక్కువగా విడుదల అవుతుందని తద్వారా ఒత్తిడి ప్రభావం అంతగా ఉండని పేర్కొన్నారు. అధ్యయనంలో భాగంగా వివిధ వయస్సు ఉన్న మహిళలు.. వారి మధ్య స్నేహం ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశోధకులు  మిచెల్ రోడ్రిగ్స్ , సి ఆన్ యూన్ పరిశీలనలోకి తీసుకున్నారు. ఇందులో మొత్తం 32 మంది మహిళలు పాల్గొన్నారు.  మొదట మాట కలిపే ఆసక్తి ఉన్న మహిళలు ఇతరులతో సంభాషణ చేయడం.. వాటి ప్రభావం ఇతరుల పై ఏ మేరకు ఉంటుంది... ఇలా పలు విషయాలపై అధ్యయనాలను జరిపారు. ఇందులో ఒత్తిడికి పరిష్కార మార్గాలుగా.. ఓ స్త్రీ ఇతర స్నేహితురాలితో సంభాషించడం వల్ల ఒత్తిడి అనేది దూరమవుతుందని.. ఇదంతా సామాజికంగా చక్కటి ఫలితాలు చూపడమే కాక వారి కమ్యూనికేషన్‌ను మెరుగుపరుచుకునేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాగా పెద్ద వయస్సు ఉన్న మహిళలతో పోలిస్తే యువతులు ఆసక్తిగా తమ విషయాలను పంచుకున్నారని, ముఖ్యంగా అపరిచితులతో మాట కలిపేందుకు మధ్య వయస్సు ఉన్న యువతులు కాస్త నిరాకరించినట్లు తేలింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని