TTD: జమ్మూకశ్మీర్‌లో జూన్‌ 8న శ్రీవారి ఆలయ సంప్రోక్షణ: తితిదే

జమ్మూకశ్మీర్‌లో జూన్‌ 8వ తేదీన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ సంప్రోక్షణ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది.

Updated : 31 May 2023 18:32 IST

తిరుమల: జమ్మూకశ్మీర్‌లో జూన్‌ 8వ తేదీన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయ సంప్రోక్షణ ఉంటుందని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వెల్లడించింది. జూన్‌ 3న శ్రీవారి ఆలయంలో వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయని తెలిపింది. జమ్మూకశ్మీర్‌లో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాన్ని తితిదే నిర్మించిన విషయం తెలిసిందే. వైఖానస ఆగమోక్తంగా, సర్వాంగ సుందరంగా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మాతా వైష్ణోదేవి దర్శనం కోసం జమ్మూ వచ్చే భక్తులకు శ్రీవారి ఆలయ సందర్శనం ఎనలేని ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనుందని తితిదే అధికారులు తెలిపారు.

శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న కార్యక్రమాల వివరాలు..

  • జూన్ 3 - సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ఆచార్యవరణం, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ నిర్వహిస్తారు.
  • జూన్ 4 - ఉదయం 8 నుంచి 11 గంటల వరకు పంచగవ్యప్రాసన, వాస్తు హోమం, అకల్మష ప్రాయశ్చిత్త హోమం, రక్షాబంధనం ఉంటుంది. సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు అగ్ని ప్రతిష్ఠ, కుంభస్థాపన, కుంభారాధన, విశేష హోమం నిర్వహిస్తారు.
  • జూన్ 5 - ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, అక్షిన్మోచనం, నవకలశ స్నపనం, పంచగవ్యాధివాసం ఉంటుంది. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
  • జూన్ 6 - ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, నవకలశ స్నపనం, క్షీరాధివాసం నిర్వహిస్తారు. సాయంత్రం యాగశాల వైదిక కార్యక్రమాలు చేపడతారు.
  • జూన్ 7 - ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, జలాధివాసం, రత్నన్యాసం, ధాతున్యాసం, విమాన కలశ స్థాపన బింబస్థాపన(విగ్రహప్రతిష్ఠ) ఉంటుంది. సాయంత్రం మహాశాంతి తిరుమంజనం, రాత్రి శయనాధివాసం నిర్వహిస్తారు.
  • జూన్ 8 - ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు మిథున లగ్నంలో మహా సంప్రోక్షణ నిర్వహిస్తారు. 9.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీవారి కల్యాణోత్సవాన్ని  నిర్వహిస్తారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఆలయ ఈవో ధర్మారెడ్డితో పాటు పలువురు స్థానిక ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని