ఇక్కడి న్యాయమూర్తి.. జపాన్‌లో దేవుడు!
జస్టిస్ రాధాబినోద్ పాల్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మన భారత చరిత్రలో ఈయన పేరు పెద్దగా ప్రస్తావించి ఉండకపోవచ్చు. చరిత్రకారులకు తప్ప సామాన్య భారతీయులు ఆయన్ను గుర్తించకపోవచ్చు. కానీ, జపానీయులు ఆయన్ను దేవుడిలా భావిస్తున్నారు. దేవాలయాల్లో ఆయన స్మారక చిహ్నాలు స్థాపించి
(Photo: Sudhi Binod facebook)
ఇంటర్నెట్ డెస్క్: జస్టిస్ రాధాబినోద్ పాల్.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? మన భారత చరిత్రలో ఈయన పేరు పెద్దగా ప్రస్తావించి ఉండకపోవచ్చు. చరిత్రకారులు, సామాన్య భారతీయులు ఆయన్ను గుర్తించకపోవచ్చు. కానీ, జపనీయులు ఆయన్ను దేవుడిలా భావిస్తున్నారు. దేవాలయాల్లో ఆయన స్మారక చిహ్నాలు స్థాపించి ఆరాధిస్తున్నారు. ఇంతకీ ఎవరు ఆయన? ఏం చేశాడని దేవుడంటున్నారు?
1886 జనవరి 27న అప్పటి బెంగాల్ ప్రావిన్స్‌లో జన్మించిన జస్టిస్ రాధాబినోద్ పాల్.. కోల్‌కతా యూనివర్సిటీలో న్యాయశాస్త్రం చదువుకున్నారు. 1941లో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా, బ్రిటీష్ ఇండియాకు సలహాదారుగా వ్యవహరించారు.
‘టోక్యో ట్రయల్’ధర్మాసనంలో సభ్యుడు
రెండో సినో-జపనీస్ యుద్ధం, రెండో ప్రపంచయుద్ధం తర్వాత జపాన్‌పై విచారణ నిమిత్తం ఇంటర్నేషనల్ మిలటరీ ట్రైబ్యునల్ ఫర్ ది ఫార్ ఈస్ట్(ఐఎంటీఎఫ్‌ఈ) ఏర్పాటైంది. దీన్నే ‘టోక్యో ట్రయల్’గా పిలుస్తుంటారు. ఈ కేసుపై విచారణ జరిపేందుకు అప్పటి అమెరికా జనరల్, మిత్రపక్ష కూటమి సుప్రీం కమాండర్ డగ్లస్ మాక్‌ఆర్థర్ 1946 జనవరి 19న ట్రయల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. రెండో ప్రపంచ యుద్ధంలో గెలుపొందిన మిత్రపక్ష కూటమిలోని 11 దేశాలు (ఆస్ట్రేలియా, కెనడా, చైనా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఫిలిప్పిన్స్, సోవియట్ యూనియన్, యూకే, యూఎస్‌తోపాటు భారత్) ప్రాతినిథ్యం వహించేలా న్యాయమూర్తుల బెంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో టోక్యో ట్రయల్ బెంచ్‌కి భారత్ తరఫున జస్టిస్ రాధాబినోద్ పాల్‌ను బ్రిటీష్ ఇండియా ప్రభుత్వం నామినేట్ చేసింది. దీంతో ఆ ధర్మాసనంలో జస్టిస్ రాధాబినోద్ సభ్యుడయ్యారు.
ఎందుకీ టోక్యో ట్రయల్?
‘‘జపాన్ సైన్యం ఆసియా-పసిఫిక్ దేశాలపై దండెత్తి అనేక ఘోరాలకు పాల్పడింది. చైనాతో యుద్ధం.. ఆ తర్వాత జరిగిన రెండో ప్రపంచయుద్ధంలోనూ ఇటలీ, జర్మనీతో కలిసి జపాన్ దుందుడుకుగా వ్యవహరించింది’’అనే ఆరోపణలు జపాన్‌పై ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్, ఇటలీ, జర్మనీ దేశాలు ఓడిపోయాయి. దీంతో మిత్ర పక్ష కూటమి దేశాలు జపాన్ చేసిన నేరాలకు తగిన శిక్ష వేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో జపాన్ ప్రధానమంత్రి సహా పాలకులు, సైన్యాధికారులు ఇలా వేలమందిపై హత్యలు, శాంతి భద్రతలకు విఘాతం, ఆక్రమణలు అంటూ 55 కేసులు పెట్టి అరెస్టు చేశారు. జపాన్ చక్రవర్తి హీరోహిటో నిందితుడిగా లేకపోవడం గమనార్హం. ఈ కేసుపై విచారణ జరిపేందుకే టోక్యో ట్రయల్స్ బెంచ్ ఏర్పాటైంది. 1946 ఏప్రిల్ 29న టోక్యో కేసు విచారణ ప్రారంభం కాగా.. 1948 డిసెంబర్‌లో కోర్టు తుది తీర్పు వెలువరించింది.
కోర్టు ఏం తీర్పు ఇచ్చింది? జస్టిస్ రాధాబినోద్ ఏమన్నారు?
11 దేశాల న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం నిందితులకు మరణశిక్షలు, జీవితఖైదు విధించాయి. కొందరు నిందితులు కోర్టు విచారణ జరుగుతున్న కాలంలో మృతి చెందారు. కాగా.. న్యాయమూర్తుల బెంచ్ నిందితులకు శిక్షలు విధించడాన్ని భారత న్యాయమూర్తి జస్టిస్ రాధాబినోద్ ఒక్కరే విభేదించారు. ఆలస్యంగా ఈ బెంచ్‌లో సభ్యుడిగా చేరిన ఆయన.. కేసును అన్ని కోణాల్లో క్షుణ్ణంగా విచారించి యుద్ధంలో దుందుడుకుగా జపాన్ వ్యవహరించిందని నిరూపించడానికి బలమైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. జపాన్ యుద్ధ నేరాలు ఆ దేశ ప్రభుత్వ విధానం కాదని, నేరాలకు ప్రభుత్వ అధికారులు నేరుగా బాధ్యులు కారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. దాడులు చేస్తూ.. రెచ్చగొడుతూ.. శత్రుదేశాలే జపాన్‌ను యుద్ధంలోకి దిగేలా చేశాయని.. అలాంటప్పుడు ఈ నేరంలో ఆ దేశాల పాత్ర ఉన్నట్లేనని వ్యాఖ్యానించారు. 1937 సమయంలో దుందుడుకుగా యుద్ధం చేయడం నేరమేమి కాదని గుర్తు చేశారు. ఓ ఘటన జరిగిన తర్వాత చట్టాలు రూపొందించి శిక్షలు వేయడం సరికాదని, అందుకే నిందితులంతా నిర్దోషులని జస్టిస్ రాధాబినోద్ తన అభిప్రాయం వెల్లడించారు. కానీ, మెజార్టీ తీర్పే అమలైంది.
వాస్తవ పరిస్థితులు అర్థం చేసుకున్నవారంతా జస్టిస్ రాధాబినోద్ వెల్లడించిన అభిప్రాయంతో ఏకీభవించారు. ఆయన నిర్ణయాన్ని జపాన్ ప్రజలు స్వాగతించారు. ప్రపంచమంతా జపాన్‌ను దోషిగా భావిస్తే.. జస్టిస్ రాధాబినోద్ మాత్రమే వారికి అండగా నిలవడంతో ఆ దేశ ప్రజలు ఆయన్ను దేవుడిలా భావించారు.
దేవాలయాల్లో స్మారక చిహ్నాలు
టోక్యో ట్రయల్ పూర్తయిన తర్వాత కూడా జస్టిస్ రాధాబినోద్ పాల్ పలుమార్లు జపాన్‌లో పర్యటించారు. టోక్యో ట్రయల్‌లో దోషులుగా తేలి శిక్ష అనుభవిస్తున్న వారిని పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన ఒకచోట ప్రసంగిస్తూ.. పాశ్చత్యాదేశాలకు వ్యతిరేకంగా నిలబడ్డ ఏకైక ఆసియా దేశం జపాన్ అని కొనియాడారు. జస్టిస్ రాధాబినోద్‌ను అప్పటి జపాన్ చక్రవర్తి ఫస్ట్ క్లాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సాక్రెడ్ ట్రెజర్ అవార్డు ప్రదానం చేశారు. జపాన్ ప్రజల నుంచి గౌరవం అందుకున్నారు. ఈ క్రమంలో ఆయన స్మారక చిహ్నాలను టోక్యోలోని యసుకుని, రియోజెన్ గోకోకు దేవాలయాల్లో ఏర్పాటు చేసి దేవుడిలా ఆరాధిస్తున్నారు. ఏటా ఆయన జయంతి, వర్థంతి రోజున నివాళులర్పిస్తారు.
భారత ప్రభుత్వం ఆయన్ను 1959లో పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది. 1967 జనవరి 10న జస్టిస్ రాధాబినోద్ పాల్ కోల్‌కతాలో కన్నుమూశారు. ఈ టోక్యో ట్రయల్‌పై 2016లో అదే పేరుతో వెబ్‌సిరీస్ వచ్చింది. ఇందులో జస్టిస్ రాధాబినోద్ పాత్రలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ నటించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin: అర్జున్.. నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తనయుడికి సూచించిన సచిన్ తెందూల్కర్
-
Movies News
Aishwarya Lekshmi: నటిని అవుతానంటే నా తల్లిదండ్రులే వ్యతిరేకించారు: ఐశ్వర్య లక్ష్మి
-
India News
20 ఏళ్లలో 3 సార్లు కోరమాండల్‌కు ప్రమాదం.. రెండు ఒడిశాలోనే!
-
Sports News
David Warner: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్.. అదే ఆఖరు సిరీస్
-
India News
PM Modi: బాధ్యులపై కఠిన చర్యలు : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
-
General News
Odisha Train Tragedy: రైలు ప్రమాదం.. 316మంది ఏపీ వాసులు సేఫ్, 141మంది ఫోన్లు స్విచ్ఛాఫ్