Gold: బంగారు కలలన్నీ శ్రావణంపైనే..!

బంగారం వ్యాపారంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. గతేడాది నుంచి పసిడి ఒడిదొడకులు ఎదుర్కొంటోంది. పండగలు, పెళ్లిళ్ల సందడి తగ్గడంతో పుత్తడి అమ్మకాలు తగ్గిపోయాయి....

Published : 12 Jul 2021 18:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బంగారం వ్యాపారంపై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. గతేడాది నుంచి పసిడి ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. పండగలు, పెళ్లిళ్ల సందడి తగ్గడంతో పుత్తడి అమ్మకాలు తగ్గిపోయాయి. కొవిడ్ కేసులు కొంత తగ్గుముఖం పట్టినా.. వ్యాపారం పూర్తిగా పుంజుకోవడం లేదు. శ్రావణ మాసం నుంచైనా కలిసి వస్తుందనే అంచనా వేస్తున్న బంగారం వ్యాపారులు కొండంత ఆశలతో ఎదురు చూస్తున్నారు.

పెళ్లిళ్లు.. పేరంటాలు.. పండగలు.. వేడుకలు.. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ముందు ఆడవాళ్ల మదిలో మెదిలేది బంగారమే. రేటు ఎంత పెరిగినా బడ్జెట్‌ను బట్టి పసిడిని కొనుగోలు చేస్తుంటారు. కొవిడ్‌ కారణంగా బంగారం వ్యాపారం ఆశాజనకంగా సాగడంలేదు. విక్రయాలు బాగా పడిపోవడంతో వినియోగదారులను ఆకర్షించేందుకు ఆఫర్లతోపాటు సరికొత్త డిజైన్లను అందుబాటులోకి తెస్తున్నారు. కొవిడ్‌ కొంత అదుపులోకి రావడంతో వాయిదా పడుతూ వస్తున్న కొత్త షోరూంల ప్రారంభోత్సవాలను ముమ్మరం చేస్తున్నారు.

బంగారం కొనుగోలు చేసే అతివలు హెవీ లుక్‌తోపాటు తక్కువ బడ్జెట్‌ ఉండే కలెక్షన్‌ వైపు మొగ్గుచూపుతుండటంతో.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా దుకాణాదారులు ఆభరణాలను రూపొందిస్తున్నారు. టెంపుల్‌ జ్యువెలరీ, ఖరీదైన స్టోన్‌ జ్యువెలరీ, మైన్‌ రేర్‌ డైమండ్‌, ఎరాకుండన్‌ జ్యువెలరీ, జెవెల్‌ కలెక్షన్‌ పేరుతో 18 క్యారెట్ల బంగారు ఆభరణాలను అందుబాటులోకి తెస్తున్నారు. వినియోగదారులను ఆకట్టుకునేలా ఆఫర్లతోపాటు.. వైరస్‌ బారిన పడకుండా రక్షణ చర్యలు తీసుకుంటున్నామని జ్యువెలరీ వ్యాపారులు పేర్కొంటున్నారు.

లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తేయడంతో వాయిదా పడిన వివాహాలు, వేడుకలు ఊపందుకున్నాయి. షాపింగ్‌ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత బంగారం కొనుగోలు చేయడం ఆనందంగా ఉందని వినియోగదారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. బయటకు రావాలంటే భయంగానే ఉందని పేర్కొంటున్నారు. రెండేళ్లుగా కరోనాతో ఇబ్బందులు పడుతున్న జ్యువెలరీ వ్యాపారులు శ్రావణమాసం పెళ్లిళ్లు, పండగలతో మళ్లీ అమ్మకాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్‌ టీకాలు వేయించుకోవడంతోపాటు మార్గదర్శకాలు పాటిస్తే వైరస్‌ ముప్పు కొంతమేర తగ్గి కార్యకలాపాలు సాధారణంగా సాగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని