Updated : 23 Jun 2022 18:32 IST

Telangana News: విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు కామన్‌ బోర్డు... త్వరలో నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది నిమాయకాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం మినహా రాష్ట్రంలోని 15  యూనివర్సిటీల్లో ఇకపై బోధన, బోధనేతర సిబ్బంది నియామకం కామన్‌  బోర్డు ద్వారా జరగనుంది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వుల జారీ చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ అధ్యక్షుడిగా, విద్య, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులను బోర్డులో సభ్యులుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ బోర్డు కన్వీనర్‌గా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అవసరమైతే మరో సభ్యుడిగా నిపుణులను నియమించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 15 యూనివర్సిటీల్లో ఉద్యోగ నియామకాలను ఉమ్మడి నోటిఫికేషన్ల ద్వారా చేపట్టనున్నారు. బోర్డు విధివిధానాలు,  నియామక ప్రక్రియ ఎలా చేపట్టాలి?తదితర అంశాలపై త్వరలో స్పష్టత రానుంది. వర్సిటీల్లోని 3,500 ఉద్యోగాల భర్తీకి కామన్‌ బోర్డు ప్రక్రియ ప్రారంభించనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా ఇప్పటికే అనుమతిచ్చింది. నియామక ప్రక్రియకోసం వేచి చూస్తున్నారు.

త్వరలో నిబంధనలు ఖరారు..

ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ, తెలంగాణ, తెలుగు, పాలమూరు, శాతవాహన, అంబేడ్కర్‌, మహాత్మగాంధీ, జేఎన్‌ఏఎఫ్‌ఏయూ, వ్యవసాయ, పశుసంవర్థక, ఉద్యాన, అటవీ, ఆర్జీయూకేటీ విశ్వవిద్యాలయాల్లో నియామకాలను కామన్ బోర్డు చేపట్టనుంది. విశ్వవిద్యాలయాల్లో 3,500 బోధన, బోధనేతర ఉద్యోగాలను భర్తీ చేయాలని ఏప్రిల్ 12న రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయించింది. గతంలో యూనివర్సిటీలే వేర్వేరుగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టే విధానం అమల్లో ఉంది. దానివల్ల ఒకే అభ్యర్థి వేర్వేరు యూనివర్సిటీల్లో ఉద్యోగాల్లో నియామకమైనప్పుడు.. మళ్లీ ఖాళీలు ఏర్పడుతున్నాయన్న చర్చ జరిగింది. దానికి తోడు ఒక్కో యూనివర్సిటీ ఒక్కో విధానం అమలు చేయడం వల్ల గందరగోళం తలెత్తుతుందన్న సందేహాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీల్లో నియామకాల కోసం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫార్సులను పరిశీలించిన కేబినెట్ కామన్‌ బోర్డును ఏర్పాటు చేయాలని ఏప్రిల్ 12న నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఇవాళ బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో 16 జారీ చేసింది. బోర్డు నిర్వహణ ఖర్చులను ఉన్నత విద్యా మండలి ఆయా యూనివర్సిటీల నుంచి సేకరించి బోర్డుకు కేటాయిస్తుంది. బోర్డు విధివిధానాలు, నియామక ప్రక్రియ నిబంధనలను త్వరలో ఖరారు చేయనున్నారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని