NTR: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం

మే 20న హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో నిర్వహించనున్న ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు  టీడీ జనార్దన్ నేతృత్వంలోని ఎన్టీఆర్‌ సావనీర్‌ కమిటీ సభ్యులు ఆయనకు ఆహ్వానపత్రిక అందజేశారు.

Published : 15 May 2023 16:09 IST

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు జూనియర్‌ ఎన్టీఆర్‌కు ఆహ్వానం అందింది. తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా టీడీ జనార్దన్‌ నేతృత్వంలోని ఎన్టీఆర్‌ సావనీర్‌ కమిటీ మే 20న కూకట్‌పల్లిలో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఎన్టీఆర్‌కు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ‘జయహో ఎన్టీఆర్‌’ పేరుతో వెబ్‌సైట్‌ ఆవిష్కరణ, ఎన్టీఆర్‌పై ప్రత్యేకంగా రూపొందించిన ‘శకపురుషుడు’ సావనీర్‌ను విడుదల చేయనున్నారు.

ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల కార్యక్రమానికి ఎవరెవర్ని ఆహ్వానించాలనే దానిపై తొలుత తెదేపా అధినేత చంద్రబాబు నివాసంలో సావనీర్‌ కమిటీ సభ్యులు చర్చించారు. చంద్రబాబు సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని నందమూరి బాలకృష్ణ, రామకృష్ణ పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు ఆహ్వానాలు అందజేశారు. ఈ నేపథ్యంలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌, దగ్గుపాటి పురందేశ్వరి దంపతులను సాదరంగా ఆహ్వానించారు. సావనీర్‌ కమిటీ ఛైర్మన్‌ టీడీ జనార్దన్‌, నందమూరి రామకృష్ణలు స్వయంగా వెళ్లి వీరికి ఆహ్వానపత్రిక అందజేశారు. వీరితో పాటు నందమూరి జయకృష్ణ, నందమూరి మోహనకృష్ణ, గారపాటి లోకేశ్వరి, కంఠమనేని ఉమ శ్రీనివాస ప్రసాద్‌, నందమూరి కల్యాణ చక్రవర్తి, కాట్రగడ్డ హనుమంతరావులను ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు.

తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఎన్టీఆర్‌ జన్మించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా వంద ప్రాంతాల్లో కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలకు సంబంధించి కార్యాచరణ ప్రకటించారు. అలాగే ఏప్రిల్‌ 28న విజయవాడలో నిర్వహించిన కార్యక్రమానికి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని