Pinnelli: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్లపై 18న తీర్పు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్లపై ఈనెల 18న తీర్పు వెలువడనుంది.

Published : 10 Jul 2024 18:00 IST

గుంటూరు: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్లపై ఈనెల 18న తీర్పు వెలువడనుంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం వద్ద తెదేపా ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావుపై దాడి, కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి కేసుల్లో పిన్నెల్లి అరెస్టయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. ఈ రెండు కేసుల్లో బెయిల్‌ ఇవ్వాలని పిన్నెల్లి మాచర్ల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. న్యాయస్థానం బెయిల్‌ నిరాకరించింది.

దీంతో ఆయన గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారణకు రాగా.. పిన్నెల్లి తరఫున న్యాయవాదులు బెయిల్‌ కోసం వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అశ్విని కుమార్‌ వాదనలు వినిపిస్తూ బెయిల్‌ ఇవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. పిన్నెల్లి నేర చరిత్ర.. ఈ కేసులో మరికొంత మందిని అరెస్టు చేయాల్సి ఉన్నందున బెయిల్‌ ఇవ్వొద్దని కోరారు.

పిన్నెల్లి కొద్ది రోజులు పరారుకావటంపైనా కోర్టులో వాదనలు జరిగాయి. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని, పోలీసు విచారణకు ఏ మాత్రం సహకరించటం లేదన్న విషయాన్ని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. పోలీస్ కస్టడీ విచారణ వివరాల్ని కోర్టు ముందుంచారు. ఈ కేసుల్లో విచారణ ఇంకా జరగాల్సి ఉన్నందున ఈనెల 18కి తీర్పు వాయిదా వేస్తూ న్యాయమూర్తి శరత్ బాబు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని