TS News: సమ్మె విరమించిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు

క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో 16 రోజులుగా చేస్తున్న సమ్మెను తెలంగాణ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) శనివారం విరమించారు.

Updated : 14 May 2023 00:06 IST

హైదరాబాద్‌: క్రమబద్ధీకరణ సహా పలు డిమాండ్లతో 16 రోజులుగా చేస్తున్న సమ్మెను తెలంగాణ జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు (జేపీఎస్‌) శనివారం విరమించారు. శనివారం మధ్యాహ్నం 12 గంటల లోపు విధుల్లో చేరాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో పలు జిల్లాల్లో చాలా మంది జేసీఎస్‌లు విధుల్లో చేరారు. దీంతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌ గౌడ్‌ ఇతర ప్రతినిధులు శనివారం రాత్రి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి తమ సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నుంచి విధుల్లో చేరతామని ప్రకటించారు. జేపీఎస్‌లను శనివారం మధ్యాహ్నం లోపు విధుల్లో చేరకపోతే వెంటనే తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం వరకు ఎవరైనా విధుల్లో చేరకుంటే వారి స్థానంలో కొత్తగా తాత్కాలిక జేపీఎస్‌లను నియమించాలని సూచించారు.

ఈ హెచ్చరికల ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు సమ్మె విరమించి విధులకు హాజరయ్యారు. కొందరు సందిగ్ధంలో ఉండి రాష్ట్ర సంఘం నిర్ణయం కోసం ఎదురు చూశారు. చివరకు అన్ని జిల్లాల నేతలు సమ్మె విరమణకే మొగ్గు చూపారు. ఈ మేరకు రాష్ట్ర సంఘం ప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లిని కలిసి సమ్మె విరమణ నిర్ణయాన్ని వెల్లడించారు. తాము యథాతధంగా విధులు నిర్వర్తిస్తామని, తమకు తగిన న్యాయం చేయాలని మంత్రిని కోరారు.  సమస్యలను సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని