Published : 22 Feb 2022 01:27 IST

Kacha Badam: ఇకపై ‘కచ్చా బాదం’ అమ్మను.. బయటకు వెళ్తే నన్ను కిడ్నాప్‌ చేయొచ్చు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌మీడియా ఎప్పుడు, ఎవర్ని సెలబ్రిటీని చేస్తుందో ఊహించలేం. అలా అనుకోకుండా క్రేజ్‌ సంపాదించిన వారు ఎందరో. ఆ కోవకే చెందుతాడు ‘కచ్చా బాదం’ సింగర్‌ భువన్ బద్యాకర్. కొద్దిరోజులుగా ఎక్కడ చూసినా అతడు పాడిన పాటే మారుమోగుతోంది. సామాజిక మాధ్యమాలను షేక్‌ చేస్తోంది. నెటిజన్లే కాదు.. సెలబ్రిటీలు కూడా స్టెప్పులేస్తూ ఆ వీడియోలను పంచుకుంటున్నారు. ఈ ఒక్క పాట.. వీధుల్లో తిరుగుతూ పల్లీలు అమ్ముకునే ఓ వీధి వ్యాపారిని స్టార్‌ను చేసింది. అతడి జీవితాన్నీ మార్చేసింది.

ఈ పాటతో విపరీతమైన క్రేజ్‌ సంపాదించుకున్న భువన్ బద్యాకర్ ప్రస్తుతం ప్రైవేట్‌ ఆల్బమ్స్‌, టెలివిజన్‌ రియాలిటీ షోలు, లైవ్‌ షోలు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ బిజీగా మారిపోయాడు. వేషధారణ పూర్తిగా మార్చేశాడు. తాజాగా కోల్‌కతాలోని నైట్‌ క్లబ్‌లో లైవ్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చిన అనంతరం స్థానిక మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజలు తనను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందన్న భువన్‌.. తనమీద చూపిస్తున్న ప్రేమకు మాటలు రావడంలేదన్నారు.

ప్రస్తుతం తాను బయటకు వెళ్లి కచ్చా బాదం (పచ్చి పల్లీలు) విక్రయించడం లేదని భువన్‌ తెలిపారు. ‘నాకు ఇప్పుడు ఎంతో క్రేజ్‌ లభిస్తోందని, బయటకు వెళ్లొద్దని నా సన్నిహితులు చెప్పారు. ఒంటరిగా బయటకు వెళ్తే నన్నెవరైనా కిడ్నాప్‌ చేయొచ్చని హెచ్చరించారు’ అని భువన్ పేర్కొన్నారు. ఇకపై ఏం చేయాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ‘ఇప్పుడు నేను సెలబ్రిటీనయ్యా. ఇలాగే ముందుకు వెళ్లాలనుకుంటున్నా. కళాకారుడిగానే కొనసాగుతా. ఇప్పుడు నేను బయటకెళ్లి పల్లీలు అమ్మితే అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.

పశ్చిమబెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా కురల్జూరి గ్రామానికి చెందిన భువన్ బద్యాకర్ కొద్దిరోజుల వరకు వీధి వ్యాపారి. ద్విచక్రవాహనంపై వీధి వీధి తిరుగుతూ పచ్చిపల్లీలు అమ్ముతుండేవాడు. పాతవి, పాడైన వస్తువుల్ని తీసుకొని పచ్చి పల్లీలు ఇస్తుండేవాడు. పాత సామాన్లు, పాడైన మొబైల్‌ఫోన్లను తీసుకొని పచ్చి పల్లీలు ఇస్తాననే అర్థం వచ్చేలా లిరిక్స్‌ రాసుకొని ‘కచ్చా బాదం’ ట్యూన్‌ కట్టాడు. కొన్ని నెలల కిందట భువన్‌ పాట పాడుతుండగా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరలయింది. ఎప్పుడైతే మోడల్‌ అంజలి అరోరా ఆ పాటకు ప్రత్యేకంగా స్టెప్పులు సృష్టించి వీడియో చేసిందో.. అప్పటి నుంచి ఆ పాటకు మరింత క్రేజ్‌ వచ్చింది. నెటిజన్లు ఆ పాటకు అంజలి అరోరా స్టెప్పులు వేస్తూ రీల్స్‌ చేయడం ప్రారంభించారు. క్రమంగా ఆ క్రేజ్‌ దేశంతోపాటు విదేశాలకు పాకింది.

భువన్‌ పాడిన పాట సినిమా ఇండస్ట్రీకి వరకు చేరడంతో ఇటీవల ఓ మ్యూజిక్‌ సంస్థ అతడితో ఓ ర్యాప్‌ సాంగ్‌ రూపొందించింది. అవే లిరిక్స్‌కు ర్యాప్‌ను జోడించి.. భువన్‌ వస్త్రధారణను మార్చేసి.. అతడి పక్కన ఓ మోడ్రన్‌ అమ్మాయితో డాన్స్‌ చేయించారు. యూట్యూబ్‌లో ఈ పాటను విడుదల చేయగా.. ఇప్పటి వరకు 7.6 కోట్ల మందికి పైగా వీక్షించారు.Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని