Andhra News: శవానికీ తప్పని వేధింపులు.. 3గంటలుగా వాహనంలోనే కామాక్షి మృతదేహం

వైకాపా నాయకుల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కామాక్షి మృతదేహానికి కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయినా పోలీసులు స్వగ్రామానికి తరలించడంలేదు. 

Published : 18 Nov 2022 01:45 IST

కాకినాడ: వైకాపా నాయకుల వేధింపులతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న కామాక్షి మృతదేహానికి కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం పూర్తయినా పోలీసులు స్వగ్రామానికి తరలించడంలేదు. కాకినాడ జీజీహెచ్‌లో నిన్న మధ్యాహ్నం కామాక్షి మృతి చెందారు. ఇవాళ పోస్టుమార్టం పూర్తి చేసి మధ్యాహ్నం 12.30కి మృతదేహాన్ని మహాప్రస్థానం వాహనంలోకి  తరలించారు. అయితే, ఆసుపత్రికి కొద్ది దూరంలోనే మహాప్రస్థానం వాహనాన్ని దాదాపు 3 గంటలకు పైగా పోలీసులు నిలిపివేశారు. మృతదేహం వాసన వస్తోంది, ఇంటికి తరలించాలని కుటుంబ సభ్యులు వేడుకున్నా పోలీసులు కనికరించడం లేదని బంధువులు వాపోయారు.

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం మామిడితోట గ్రామంలో రోడ్డు పక్కన 40 ఏళ్లుగా ఉన్న కామాక్షి ఇంటిని అధికారులు తొలగించటంతో కుమారుడితో కలిసి ఆమె పురుగుల మందు తాగారు. చికిత్స పొందుతూ కామాక్షి చనిపోగా.. కుమారుడు మురళీకృష్ణ పరిస్థితి విషమంగా ఉంది. కోటిపల్లి కామాక్షి(60), ఆమె కుమారుడు మురళీకృష్ణ(36) ఇటీవల సెల్ఫీవీడియో తీసుకొని ‘మా ఇల్లు పడగొట్టేశారు.. మమ్మల్ని చిత్రహింసలకు గురి చేశారు.. స్థానిక వైకాపా నాయకుల వేధింపుల కారణంగానే మేం చనిపోతున్నాం’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. మరో వైపు కామాక్షి మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ తెదేపా, జనసేన కార్యకర్తలు మామిడితోటలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడికి పోలీసులు భారీగా చేరుకుని ఆందోళన కారులను అరెస్టు చేసి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని