Kanakalatha Barua: తమ్ముళ్ల కోసం చదువు మానేసి... దేశం కోసం ప్రాణాలర్పించి!

ఉవ్వెత్తున సాగిన ఉద్యమం.. దిక్కులు పెక్కటిల్లేలా తూటాల మోతలు.

Updated : 05 May 2022 17:44 IST


(చిత్రం: వికీపీడియా)

దేశం కోసం పోరాటం... స్వేచ్ఛ జీవనం కోసం ఆరాటం...

తుపాకీ తూటాలు ఎదురొచ్చినా.. వెనుకడుగేయని గుండె ధైర్యం... 

 మాతృ దేశం కోసం ప్రాణాలను లెక్క చేయని వీర యువతి..

తెల్ల సైనికులు గుండెల్లో తుపాకీ గుండ్లు నింపినా.. ఎత్తి పట్టిన జాతీయ జెండాను వదల్లేదు!

తెల్ల దొరల పాలనకు నిరసనగా ఉద్యమంలో ముందుగా నిలిచి ... దేశం కోసం ప్రాణాలను వదిలిందీ కనక్‌లతా బారువా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉవ్వెత్తున సాగిన ఉద్యమం.. దాన్ని అడ్డుకునేందుకు తూటాల మోతలు. బ్రిటిషు పాలన అంతమొందించాలని ఊరు ఊరు ఏకమైంది. యువజన బృందాలతో ఓ పదిహేడేళ్ల యువతి చేరింది. మువ్వన్నెల జెండాను చేత పట్టి ఆయుధాలు లేని గ్రామస్థులందరికీ ఆమె నాయకురాలైంది. జాతీయ జెండాను పట్టుకున్నందుకు బ్రిటిష్‌వారు ఆమెను హెచ్చరించారు. అయినా ఆమె జెండాను కిందకు దింపలేదు. ఇంతలోనే...బుల్లెట్లు ఆమె గుండెల్లోకి దూసుకెళ్లాయి. అయినా ఎత్తిన జెండాను వదల్లేదు. దేశం కోసం తన ప్రాణాలను బలియాగం  చేసిందీ వీర యువతి. ఆమె ఎవరో కాదు... కనక్‌లతా బారువా. అతి చిన్న వయసులోనే దేశభక్తితో తన ప్రాణాలను పణంగా పెట్టి  దేశ స్వాతంత్ర పోరాటంలో చిరస్మరణీయంగా నిలిచింది. 
 

తమ్ముళ్ల కోసం చదువు మానేసి...

అస్సాంలోని దరాంగ్‌ జిల్లాలోని బోరంగబరి గ్రామంలో బారువా 1924 డిసెంబరు 22న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు కృష్ణకాంతం, కర్ణేశ్వేరి బారువా. తన అయిదో ఏటా తన తల్లి మరణించింది. తన పదమూడో ఏటా తండ్రి మరణించారు. మూడో తరగతి వరకూ చదువుకున్న బారువా తన తమ్ముళ్ల చదువు నిమిత్తం  చదువు మానేసింది. 

దేశం కోసం ప్రాణాలు వదిలేసి...

బ్రిటిషు పాలనకు నిరసనగా గ్రామస్థులందరూ ఊరేగింపు నిర్వహించారు. స్థానిక పోలీసు స్టేషను వద్ద జాతీయ జెండాను ఎగురవేయాలని నిర్ణయించుకున్నారు. ఊరేగింపు మొదలవ్వగానే పోలీసులు తుపాకీలకు పని చెప్పారు. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. అయినా ఊరేగింపు కొనసాగుతూనే ఉంది. జెండాను ఎత్తుకున్నందుకు బ్రిటిషు పోలీసులు బారువా గుండెల్లో తుపాకీ గుండ్లను నింపారు. అయినా ఎత్తిన జెండా కిందకు దించలేదు. పదిహేడేళ్ల వయసులో దేశం కోసం  ఆత్మత్యాగం చేసింది బారువా. 

అస్సాంలోని తేజ్‌పూర్‌ రాక్‌ గార్డెన్‌లోని ఈ శిల్పం అప్పటి సంఘటను వివరిస్తుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు