Karnataka: ఆ గిత్త ధర రూ.కోటి పైమాటే..!

ప్రణాళిక, వ్యాపార మెళకువలు పాటిస్తే వ్యవసాయంలో కోట్ల రూపాయలు సంపాదించొచ్చని కర్ణాటక రైతులు నిరూపిస్తున్నారు.

Updated : 24 Sep 2022 16:26 IST

బెంగళూరు: ప్రణాళిక, వ్యాపార మెళకువలు పాటిస్తే వ్యవసాయంలో కోట్ల రూపాయలు సంపాదించొచ్చని కర్ణాటక రైతులు నిరూపిస్తున్నారు. ఆధునిక వ్యవసాయంవైపు దృష్టి సారించిన అన్నదాతలు దేశవాళీ పశువులను మార్కెట్ రారాజులుగా మారుస్తున్నారు. తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను ప్రజలకు వివరిస్తున్నారు. తమ ఆవిష్కరణలతో రైతులను స్వావలంబన దిశగా అడుగులు వేయిస్తున్నారు. 

బెంగళూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయం యూఏఎస్‌, జీకేవీకేలో వ్యవసాయ మేళా నిర్వహిస్తున్నారు. తాము అనుసరిస్తున్న వినూత్న విధానాలను రైతులు  ప్రదర్శిస్తున్నారు. మెళకువలు పాటిస్తే వ్యవసాయంలోనూ లాభాలు గడించవచ్చని కర్ణాటక రైతులు చెబుతున్నారు. సాధారణంగా మేలుజాతి గిత్తలు రూ.1-2 లక్షల ధర పలుకుతాయి. అయితే కర్ణాటకలోని మాళవల్లి నుంచి జీకేవీకే మేళాకు తెచ్చిన హళ్లికార్‌ జాతి గిత్త ఏకంగా రూ.కోటి ధర పలుకుతోందని.. ఆ గిత్త యజమాని బోరే గౌడ చెబుతున్నారు. అంతరించిపోత్తున్న హళ్లికార్‌ జాతి సంరక్షణకు ఆయన ముందుకొచ్చారు. ఈ జాతి ఆవు పాలలో.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఏ2 ప్రోటీన్‌ పుష్కలంగా ఉంటుందని పేర్కొన్నారు. హళ్లికార్‌ జాతికి చెందిన ఈ గిత్త వీర్యం ఒక డోసు ధర రూ.1000 పైనే ఉంటుంది. మూడేళ్ల వయసు నిండిన గిత్త నుంచి ప్రతి వారం వీర్యాన్ని సేకరించి నైట్రోజన్‌ కంటెయినర్‌లలో భద్రపరుస్తారు. కొన్ని వందల ఏళ్ల వరకు ఈ వీర్యాన్ని భద్రపరచవచ్చని జీకేవీకే పశు విజ్ఞాన నిపుణులు చెబుతున్నారు. దేశంలో తొలిసారిగా ప్రైవేటు సంస్థల సహకారంతో వీర్యాన్ని సేకరించి భద్రపరచడం.. హళ్లికార్‌ జాతి పశువులతోనే ప్రారంభమైనట్టు ఇక్కడి రైతులుపేర్కొంటున్నారు. సరైన పోషకాహారం అందిస్తే ఈ జాతి పశువులు 20 ఏళ్లపాటు ఆరోగ్యంగా ఉంటాయని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, మహారాష్ట్ర రైతులు సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సైతం ఈ జాతి పశువులపై ఆసక్తి చూపుతున్నాయి. వ్యవసాయం కంటే సంతానోత్పత్తి కోసమే ఈ జాతులను ఎక్కువగా వినియోగిస్తున్నారు. తాము వృద్ధి చేసిన హళ్లికార్‌ గిత్తలను కృష్ణ, ఏకలవ్య లాంటి పేర్లతో రైతులు పిలుస్తుంటారు. ఇదే మేళాలో ప్రదర్శిస్తున్న పలు జాతుల గొర్రెలు రూ.5-10 లక్షల వరకు ధర పలుకుతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికా జాతి డార్ఫర్‌ రూ.10 లక్షలు పలుకుతోందని చెప్పారు. పర్షియన్‌, డాస్కట్‌హాన్‌ జాతుల నుంచి ఈ గొర్రెను వృద్ధి చేశారు. తల భాగం నల్లగా.. శరీరం తెల్లగా ఉండే డార్ఫర్‌ సుమారు 120 కిలోల బరువు ఉంటుంది. శించన, బండూరి రకానికి చెందిన గొర్రెలు గరిష్ఠంగా రూ.7 లక్షల ధర పలుకుతున్నాయి. జీవాలతోపాటు.. వ్యవసాయ రంగంలోనూ రైతులు వినూత్న ఆవిష్కరణలు చేశారు. పేడతో అలంకృతులు, పూజా సామగ్రి, డ్రోన్లు, విత్తనం నుంచి కోత దశ వరకు.. అన్ని ప్రక్రియలు చేసే పవర్‌ వీడర్‌ లాంటివి ఆవిష్కరించారు.    


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని